Mallikarjun Kharge Congress President: ఖర్గే చేతికి ఇవాళ కాంగ్రెస్ పగ్గాలు.. పార్టీకి పూర్వ వైభవం సాధ్యమేనా..?
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ నిరాకరించడం, సోనియా, ప్రియాంక కూడా ఆసక్తి చూపకపోవడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే తోపాటు.. శశిథరూర్ పోటీ పడ్డారు.
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి ఖర్గే ప్రసంగిస్తారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఖర్గే.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్ జోడో యాత్ర చేపట్టిన ఉన్న రాహుల్ గాంధీ.. దీపావళి, మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం కోసం 3 రోజుల విరామం తీసుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఈ విరామం నేటితో ముగియనున్నది. రేపటి నుంచి మళ్లీ తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభంకానుంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబేతర వ్యక్తికి అప్పగించే కీలక ఘట్టానికి.. గాంధీ కుటుంబం సహా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, సీఎల్పీ లీడర్లు, పలువురు నేతలు హాజరుకానున్నారు. దీంతోపాటు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆహ్వానం పంపించారు.
ఈ కార్యక్రమంలో ఖర్గేకు పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ మధుసూదన్ మిస్త్రీ విజయ ధృవీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కూడా పార్టీ ఆమోదించనుంది. ఆ తర్వాత, ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా పార్టీ నాయకులనుద్దేశించి మల్లిఖార్జున్ ఖర్గే ప్రసంగించనున్నారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. కాగా.. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి.. ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.
రాహుల్ ఆసక్తి చూపకపోవడంతో..
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ నిరాకరించడం, సోనియా, ప్రియాంక కూడా ఆసక్తి చూపకపోవడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే తోపాటు.. శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఖర్గే.. శశిథరూర్‌పై ఖర్గే 84 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో అనుభవంతోపాటు.. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం కూడా ఖర్గేకి కలిసివచ్చింది. మొత్తం 9385 మంది ప్రతినిధులు ఓటు వేయగా.. మల్లిఖార్జున ఖర్గేకు 7897 ఓట్లు వచ్చాయి. థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో 416 ఓట్లు చెల్లలేదు.
అధ్యక్ష పదవిలో ఖర్గే ఉన్నా.. కీలక నిర్ణయాలన్నీ గాంధీ కుంటుంబమే.. తీసుకుంటుందా..? లేక ఖర్గేనే ముందుకు సాగుతారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీపై నిర్ణయాధికారాలన్నీ రాహుల్ అధ్యక్షుడికే వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పార్టీ విషంలో ఖర్గేకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా..? లేదా గాంధీ కుటుంబమే.. నడిపిస్తుందా అనేది ముందు ముందు తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2024 ఎన్నికల కోసం..
అధికారాన్ని కోల్పోయి సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ వైపు పార్టీలో అంతర్గత విభేధాలు.. మరోవైపు నాయకత్వ లేమితో పోరాడుతున్న పురాతన పార్టీలో మార్పులు అవసరమనే పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఖర్గే పగ్గాలు చేపట్టిన తర్వాత పాత పద్ధతులే అమలైతే ఎలా అనేది కూడా ప్రశ్నగా మారింది. ఖర్గేకి పూర్తి స్వేచ్ఛ కల్పించి.. పార్టీ పునర్నిర్మాణం జరిగితే మాత్రం కాంగ్రెస్‌కి కలిసి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా బలమైన పార్టీగా ఉన్న బీజేపీని ఎదుర్కోనేందుకు.. నూతన అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయాలు.. తీసుకోనున్నారు.. గాంధీ కుటుంబం ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోనున్నది అనేది .. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం.. బీజేపీని ఎదుర్కోనేందుకు చేయాల్సిన ప్రణాళికలు, 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి అనే సవాళ్లు ఖర్గే ముందు ఉన్నాయి. కాగా.. వచ్చే ఏడాదిన్నరలో గుజరాత్, హిమాచల్ప్రదేశ్సహా.. 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖర్గే.. జీ23 నాయకులను ఎలా సమన్వయం చేసుకుని ముందుకు సాగుతారు..? పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తారనే ప్రశ్నలు.. ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..