Mystery Illness: దేశంలో మరో మాయదారి రోగం.. 3 రోజుల్లో జుట్టంతా ఊడిపోతుంది
ఏం కాలమో ఏంటో.. మాయదారి వైరస్‌లు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. HMPV గురించి ఇంకా భయపడుతూ ఉండగానే.. తాజాగా మరో మిస్టరీ వ్యాధి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలవారిని అతలాకుతలం చేస్తోంది. పట్టుకుంటే చాలు.. కుప్పలు తెప్పలుగా జుట్టు ఊడి వచ్చేస్తుంది. మహిళలు సైతం ఈ మిస్టరీ వ్యాధి బారిన పడ్డారు.
HMPV వైరస్ ప్రస్తుతం చైనాలో ప్రబలంగా ఉంది. ఈ మహమ్మారి కేసులు మన దేశంలో కూడా నమోదవుతున్నాయి. అందువల్ల భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు మార్గదర్శకాలను కూడా జారీ చేశారు అధికారులు. అయితే హెచ్‌ఎంపీవీ భయం వెంటాడుతుండగా, మహారాష్ట్ర.. షెగావ్‌లోని బుల్దానాలో, తెలియని రోగం వ్యాపించింది. కేవలం మూడు రోజుల్లోనే తలపై జుట్టు మొత్తం ఊడిపోవడంతో.. జనం ఆందోళనకు గురవుతున్నారు. షేగావ్ తాలూకాలోని బోండ్‌గావ్, కలవాడ్, హింగానా గ్రామాల్లో గుర్తు తెలియని వైరస్ వ్యాపించి జనం ఈ వ్యాధి బారిన పడుతుండడంతో.. స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.
అందిన సమాచారం ప్రకారం, షేగావ్‌లోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఈ మిస్టరీ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ చాలా మంది ఈ తెలియని వైరస్ కారణంగా తమ జుట్టును కోల్పోతున్నారు. ముందుగా తల దురద, తర్వాత వెంట్రుకలు రాలిపోవడం, మూడోరోజు జుట్టంతా ఊడిపోతూ ఉండటంతో.. పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి షెగావ్ సమీపంలోని అనేక గ్రామాలలో వ్యాపించింది. గణనీయమైన సంఖ్యలో మహిళలతో సహా చాలా మంది జుట్టు కోల్పోయారు. ఇంతలా మిస్టరీ వైరస్ వ్యాపిస్తుంటే.. దీనిపై ఇంకా అధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానికంగా ఆగ్రహావేశాల వాతావరణం నెలకొంది. ఈ జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
మహిళలు శిరోజాలపై ఉండే మక్కువ గురించి చెప్పాల్సిన పనిలేదు. వారు కూడా ఈ వ్యాధి బారిన పడి జుట్టును కోల్పోతూ ఉండటంతో.. వారి బాధకు అంతే లేకుండా పోయింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఏవైనా పడని షాంపూ, కండీషనర్స్ వాడితే ఈ తరహా జుట్టు రాలడం సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యుల వెర్షన్. అయితే జీవితంలో ఎప్పుడూ షాంపూ వాడని, ఎప్పుడూ ముట్టుకోని వారి జుట్టు సైతం రాలిపోతుంది. షెగావ్ తాలూకా శివసేన చీఫ్ రామేశ్వర్ థార్కర్ జిల్లా ఆరోగ్య అధికారికి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ తీవ్రమైన విషయాన్ని గమనించి వెంటనే బాధిత గ్రామాల్లో చికిత్స శిబిరాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..