Maharashtra: గవర్నర్ పెట్టిన చిచ్చు.. ఆజ్యం పోసిన ఫడ్నవీస్ భార్య.. బీజేపీ-షిండే వర్గం మధ్య పెరిగిన గ్యాప్‌..

మహారాష్ట్రకి వెళ్తే ఛత్రపతి శివాజీని పొగడాలి కాని.. తక్కువచేసి మాట్లాడొద్దు. అది సామాన్యుడైనా.. అత్యున్నత స్థాయిలో ఉన్న గవర్నరైనా. మరాఠా యోధుడిని మాటంటే..

Maharashtra: గవర్నర్ పెట్టిన చిచ్చు.. ఆజ్యం పోసిన ఫడ్నవీస్ భార్య.. బీజేపీ-షిండే వర్గం మధ్య పెరిగిన గ్యాప్‌..
Devendra Fadnavis And Eknath Shinde
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 27, 2022 | 9:32 AM

మహారాష్ట్రకి వెళ్తే ఛత్రపతి శివాజీని పొగడాలి కాని.. తక్కువచేసి మాట్లాడొద్దు. అది సామాన్యుడైనా.. అత్యున్నత స్థాయిలో ఉన్న గవర్నరైనా. మరాఠా యోధుడిని మాటంటే.. శివసేన ఊరుకుంటుందా? గవర్నర్‌ మాటలకు ఫడ్నవీస్‌ భార్య వంత పాడడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మహారాష్ట్ర రాజకీయాలు ఛత్రపతి శివాజీ చుట్టే తిరుగుతుంటాయి. ఎందుకంటే.. మరాఠాలకు శివాజీ దేవుడి లాంటి వాడు కాబట్టి. శివసేన అక్కడ ప్రధాన పార్టీ కాబట్టి. ప్రభుత్వాన్ని డిసైడ్‌ చేసే కింగ్‌ మేకర్‌ కాబట్టి. ఆయనపై ఈగవాలొద్దు. మాట తూలొద్దు. కాని.. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

శివాజీ మహరాజ్‌ను ఉటంకిస్తూ.. కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు. నితిన్ గడ్కరీని పొగడబోయి.. శివాజీ మహరాజ్‌ని తగ్గించేశారు గవర్నర్‌. శివాజీ ఓ పాతకాలపు నాయకుడని వ్యాఖ్యానించారు. ఈ ఔట్‌డేటెడ్‌ కామెంట్స్‌పై శివాసేన ఉద్ధవ్‌ థాక్రే వర్గం భగ్గుమంది. శివాజీ మహరాజ్‌ పేరుతోనే పార్టీని నడుపుతున్న శివాసేన ఆయనపై ఈగవాలినా.. ఊరుకోరు. అలాంటి సమయంలో ఏకంగా ఆయనో ఔట్‌డేటెడ్‌ నాయకుడని అనడంపై ఉద్ధవ్‌ థాక్రే తీవ్రంగా మండిపడ్డారు. కోశ్యారీని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

ఉద్ధవ్‌ శివసేన దూకుడుతో షిండే వర్గం డైలమాలో పడిపోయింది. బీజేపీ నేతలు కోశ్యారీకి మద్దతుగా నిలుస్తుంటే.. షిండే నాయకులకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృతా ఫడ్నవీస్‌ గవర్నర్‌కు మద్దతుగా నిలిచారు. కోశ్యారీకి మరాఠీలంటే ఎంతో ప్రేమ అని అమృత వ్యాఖ్యానించారు. గవర్నర్‌ కోశ్యారీ గురించి వ్యక్తిగతంగా తనకు తెలుసని.. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఆయన మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలంటే ఆయనకు ఎంతో ప్రేమ.. ఇది తాను దగ్గరుండి గమనించానన్నారు. అయితే గతంలోనూ చాలా సార్లు ఇలా జరిగిందని.. ఆయన చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు అమృతా ఫడ్నవీస్‌. కానీ, ఆయన మనసు నిండా మరాఠీ మనిషే అంటూ కితాబిచ్చారు.

ఇవి కూడా చదవండి

శివాజీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కోశ్యారీని గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తోన్న వేళ.. అమృత ఆయనకు మద్దతుగా నిలవడం ఏక్‌నాథ్‌ శిందే-బీజేపీ సర్కారును మరింత ఇరుకున పడేస్తోంది. మరోవైపు ఉద్ధవ్‌ శివసేన మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. గవర్నర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. ఆయనను మహారాష్ట్ర నుంచి పంపేయాలని.. మరాఠీనే గవర్నర్‌గా నియమించాలంటోంది శివసేన. మరోవైపు షిండే వర్గం నుంచి బీజేపీకి తీవ్రంగా ప్రతిఘటన ఎదురవుతోంది. ఇంతలో అమృత వ్యాఖ్యలు పుండుమీద కారం జల్లినట్లుగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..