BJP MP Candidate Died: లోక్‌సభ పోలింగ్ మరుసటి రోజే BJP ఎంపీ అభ్యర్ధి హఠాన్మరణం.. ఓట్ల ఫలితాలకు ముందే విషాదం! సీఎం యోగీ దిగ్ర్భాంతి
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధి కున్వర్ సర్వేష్ సింగ్ శనివారం (ఏప్రిల్ 21) మరణించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే బీజేపీ ఎంపీ అభ్యర్ధి తుది శ్వాస విడిచారు. కాగా లోక్‌సభ తొలి విడత ఎన్నికలు శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొరాదాబాద్..
మొరాదాబాద్, ఏప్రిల్ 21: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధి కున్వర్ సర్వేష్ సింగ్ శనివారం (ఏప్రిల్ 21) మరణించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే బీజేపీ ఎంపీ అభ్యర్ధి తుది శ్వాస విడిచారు. కాగా లోక్‌సభ తొలి విడత ఎన్నికలు శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొరాదాబాద్ లోక్ సభ స్థానానికి కూడా పోలింగ్ జరిగింది. అయిఈతే అనారోగ్య కారణాల వల్ల బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కున్వర్ సర్వేష్ సింగ్ మృతి చెందిన విషయాన్ని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి మీడియాకు వెల్లడించారు. మొరాదాబాద్ లోక్ సభ అభ్యర్ధి కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూశారు. అయనకి గొంతుకు సంబంధించి కొంత అనారోగ్య సమస్య ఉంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారని’ తెలియజేశారు.
మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య సోషల్ మీడియా వేదికగా కున్వర్ సర్వేష్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మద్దతుదారులకు, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ‘మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కున్వర్ సర్వేష్ సింగ్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది బీజేపీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు మనోధైర్యాన్ని అందించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ సీఎం యోగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కున్వర్ సర్వేష్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ పార్టీకి బలమైన నాయకుడు. ఠాకూర్ కులానికి చెందిన సర్వేష్ కుమార్ ఎంపీ కాకముందు అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సర్వేష్ కుమార్ కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్ మొరాదాబాద్ లోక్‌సభకు చెందిన బాదాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో కాంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో లౌడ్ స్పీకర్ వివాదం సందర్భంగా సర్వేష్ కుమార్ వార్తల్లో నిలిచారు. ఇక శుక్రవారం లోక్‌సభ ఎన్నికల తొలి దశలో పోలింగ్ జరిగిన ఎనిమిది పశ్చిమ ఉత్తరప్రదేశ్ స్థానాల్లో 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొరాదాబాద్‌లో 60.60 శాతం పోలింగ్ నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.