శబరిమల ఆలయంలో బంగారం మాయం.. గోల్డ్ స్కామ్‌పై హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు….
శబరిమల ఆలయ బంగారు కుంభకోణంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వారపాలక విగ్రహాల బంగారం బరువు తగ్గడం, ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు** అధికారుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు కోసం ఏడీజీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన బంగారు పూత తాపడాల బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వోం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసు, శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
స్వర్ణ కుంభకోణం’పై ఏర్పాటైన సిట్‌కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తారు. సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో, గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌కు బలం చేకూర్చే కీలక అంశాన్ని విచారణ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు అధ్యక్షుడికి పంపిన ఒక ఈ-మెయిల్‌ను కోర్టు పరిశీలించింది.
శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల తాపడాలకు బంగారపు పూత పనులు పూర్తయిన తర్వాత తన దగ్గర అదనంగా పసిడి పలకలు మిగిలాయని పొట్టి ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. దీన్ని చూస్తుంటే పొట్టి దగ్గర మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు, దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది.
అసెంబ్లీలో తీవ్ర నిరసన
అసెంబ్లీలో ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు V D సతీశన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు రెండూ దొంగతనం గురించి తెలిసినప్పటికీ దానిని అణచివేయాలని కుట్రలు చేశాయని ఆయన ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




