WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల తేదిని ప్రకటించిన ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన్ని అరెస్టు చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన్ని అరెస్టు చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికను జులై 4 నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా, నిష్పాక్షపాతంగా జరిగేందుకు మాజీ జమ్ము కశ్మీర్ హై కోర్టు చీఫ్ జస్టీస్ మహేష్ మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయనకు లేఖ రాసింది. డబ్ల్యూఎఫ్‌ఐ కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నామని.. ఇందుకోసం మిమ్మల్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించడం సంతోషంగా ఉందంటూ ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఇతర అధికారులు సైతం తోడుగా ఉంటారని చెప్పింది.
జులై 4న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషన్ సింగ్ దాదాపు 10 ఏళ్లుగా రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన పదవి కాలం కూడా త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో మహిళా రెజ్లర్లు ఆయనపై లైంగిక ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్ భూషన్ ఖండించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రోజున ట్రయల్ కోర్టు ముందు దీనికి సంబంధించిన ఆధారాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.