Priyanka Gandhi: చురుకుగా ప్రియాంక పర్యటనలు.. రెండు రాష్ట్రాలపై యువరాణి ఫోకస్.. రాహుల్ ఎంట్రీ అప్పుడేనా?
ఇద్దరు తమతమ తొలి ప్రయత్నాలలో ఘోరమైన ఓటమినే కూడగట్టుకున్నారు. అయితేనేం పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇపుడు ఈ ఇద్దరి మొహాల్లో వెలుగు కనిపిస్తోంది.
రాహుల్ గాంధీ, ప్రియాంక వధేరా గాంధీ.. ఇద్దరు తమ రాజకీయ ప్రస్థానానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్నే ఎంచుకున్నారు. ఇద్దరు తమతమ తొలి ప్రయత్నాలలో ఘోరమైన ఓటమినే కూడగట్టుకున్నారు. అయితేనేం పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇపుడు ఈ ఇద్దరి మొహాల్లో వెలుగు కనిపిస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఘన విజయం సాధించడమే రాహుల్, ప్రియాంకల్లో కొత్త ఉత్సాహానికి కారణమన్నది జగమెరిగిన సత్యం. ఈ ఉత్సాహంతో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి రేసులోకి రాగా.. ప్రియాంక త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. 2023 సంవత్సరాంతానికి దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా డిసెంబర్ నాటికి జరగబోతున్నాయి. రాజకీయ పక్షాలు సహజంగానే ఎన్నికలను ఎదుర్కొనబోతున్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. ఇపుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ప్రభావం చూపడం రెండు జాతీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలుండగా రాజస్థాన్‌లో 25 ఎంపీ సీట్లున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని 25లో 24, మధ్యప్రదేశ్‌లోని 29లో 28 ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు జరిగిన ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ వెంటనే జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ప్రాధాన్యతాంశాలు, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ప్రియారిటీలు వేరువేరని బోధపడుతోంది.
యూత్ డిక్లరేషన్‌తో షురూ
తాజాగా కర్నాటక ఎన్నికలిచ్చిన ఉత్సాహంతో ప్రియాంక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. కర్నాటక ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన రోజే హైదరాబాద్ సరూర్‌నగర్‌లో టీపీసీసీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో ప్రియాంక పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఏం చేస్తారో తెలియజేస్తూ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ వ్యవహారాలలో ప్రియాంక చురుకుగా పాల్గొంటారని కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ నెల దాటిపోయిన ఆమె హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా టీ.కాంగ్రెస్ కీలక నేతలను ఢిల్లీకి పిలిపిస్తున్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. ఈ దఫా ఢిల్లీ భేటీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతోపాటు ప్రియాంక కూడా కీలక పాత్ర పోషించబోతున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ తర్వాత నాలుగైదు రోజుల వ్యవధిలోనే ప్రియాంక మరోసారి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్లాన్ చేశారు. ఆ ముగింపు సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఇప్పటికైతే ఆమె పర్యటన ఖరారు కానప్పటికీ.. ఆమె వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయని టీ.కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి ప్రియాంక తెలంగాణ వ్యవహారాలను చురుకుగా పర్యవేక్షిస్తారని వారు భావిస్తున్నారు.
రాహుల్ ఎంట్రీ అప్పుడే!
అయితే, ప్రియాంక తెలంగాణపై ఏ మేరకు ఫోకస్ పెట్టారో మధ్యప్రదేశ్ వ్యవహారాలపై కూడా అదే స్థాయిలో దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. జూన్ 12న మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రియాంక హిందూ ఓటర్లను ఆకర్షించేలా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నర్మదా నదికి హారతిచ్చారు. తమకు అలవాటు లేని పనులను కూడా చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారు. నిజానికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఈ మధ్య హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఏకంగా జై శ్రీరాం మంత్రాన్ని జపిస్తోంది. భజరంగ్ సేన అనే సంస్థను దాదాపు ఎంపీసీసీ అడాప్ట్ చేసుకుంది. ఆ సంస్థకు చెందిన పలువురు ఈ మధ్యకాలంలో బీజేపీని కాదని మరీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ లెక్కన ఏ రాష్ట్రానికి అవసరమైన విధానాన్ని ఆ రాష్ట్రంలో అడాప్ట్ చేసుకునే వ్యూహంతో కాంగ్రెస్ నేతలు ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. కర్నాటకలో ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు భజరంగ్ దళ్‌ని నిషేధిస్తామన్న కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ విషయానికి వచ్చే సరికి జై శ్రీరాం అంటున్నారు. అలా అనే భజరంగ్ సేన లాంటి సంస్థలను అక్కున చేర్చుకుంటున్నారు. సరే.. ఈ అంశాన్ని పక్కన పెడితే ఓవైపు మధ్యప్రదేశ్, మరోవైపు తెలంగాణా ఇలా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు కాస్త మెరుగ్గా కనిపించడంతో ప్రియాంక ఈ రెండింటిపైనా ఫోకస్ చేస్తున్నట్లు అవగతమవుతోంది. ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేశాక.. ప్రచార పర్వం ఊపందుకున్నాక రంగంలోకి రాహుల్ దిగి, కర్నాటక తరహాలో గ్రౌండ్ లెవెల్‌పై దృష్టి సారిస్తారేమో అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.