AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cash in Parliament: పార్లమెంటులోకి ఎంపీలు ఎంత నగదు తీసుకెళ్లొచ్చు? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సీటు నెంబర్ 222 వద్ద నోట్ల కట్ట దొరకడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

Cash in Parliament: పార్లమెంటులోకి ఎంపీలు ఎంత నగదు తీసుకెళ్లొచ్చు? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Parliament
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Dec 08, 2024 | 7:37 PM

Share

తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు కావడంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ ఆ నోట్ల కట్ట వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించగా.. ఆ నోట్ల కట్టకు, తనకు సంబంధం లేదని ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వివరణ కూడా ఇచ్చారు. విచారణ సంగతెలా ఉన్నా.. పార్లమెంటు ఉభయ సభల్లోకి డబ్బు తీసుకెళ్లవచ్చా.. లేదా? తీసుకెళ్తే ఎంత మొత్తంలో తీసుకెళ్లవచ్చు? ఒకవేళ పరిమితికి మించి తీసుకెళ్తే నేరమా? వంటి ప్రశ్నలెన్నో సామాన్యుడి మదిలో తలెత్తుతున్నాయి. సరిగ్గా గత ఏడాది శీతాకాల సమావేశాల్లో సందర్శకుడిలా వచ్చిన ఓ ఆగంతకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకేసి ‘రంగు పొగ’తో కలకలం సృష్టించిన ఘటన కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటన తర్వాత విజిటర్ గ్యాలరీ పాసులను జారీ చేసే ప్రక్రియను మరింత కఠినతరం చేయడంతో పాటు పార్లమెంట్ భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు అప్పగించారు. ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ‘నోట్ల కట్ట’ ఉదంతం తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయోనన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఇప్పటి వరకు పార్లమెంట్ ఉభయ సభల్లోకి ఏమేం తీసుకెళ్లవచ్చు, ఎంత మొత్తంలో తీసుకెళ్లవచ్చు అని చెప్పేందుకు ప్రత్యేక చట్టమేదీ లేకపోయినా, అత్యున్నత సభ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేలా కొన్ని నిబంధనలు మాత్రం అమలవుతన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

నగదు నిషేధం కాదు.. ప్రదర్శనపై నిషేధం

పార్లమెంట్ సభ్యులు తమ వెంట సభ లోపలికి డబ్బులు తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే ఆ డబ్బును సభలో ప్రదర్శించడంపై మాత్రం ఆంక్షలు, నిబంధనలు అమలవుతున్నాయి. ఇందుకు 2008లో జరిగిన “ఓటుకు నోటు” వివాదమే కారణం. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఐ(ఎం) ఈ కూటమికి మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా.. దాన్నుంచి గట్టెక్కడం కోసం నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రత్యర్థి క్యాంపు ఎంపీలకు లంచం ఇచ్చి వ్యతిరేకంగా ఓటు వేయకుండా వ్యూహం రచించింది. ఈ ప్రయత్నాన్ని బీజేపీ ఎంపీలు బయటపెడుతూ.. సభలోపలకు నోట్ల కట్టల సంచిని తీసుకొచ్చి సభ జరుగుతుండగానే వాటిని ప్రదర్శించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీల అవినీతి, నేతలు అమ్ముడుపోవడం వంటి పలు అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో కథనాలు వెలువడ్డాయి. సభ లోపల జరిగే తంతు దేశ ప్రతిష్టకు భంగం కలిగించకుండా ఉండడం కోసం అప్పటి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సభ లోపలికి తీసుకెళ్లకుండా నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.

పార్లమెంట్ ప్రాంగణంలో క్యాంటీన్‌తో పాటు కాఫీ బోర్డ్, టీ బోర్డు దుకాణాలు, ఢిల్లీ మిల్క్ స్కీమ్ ఔట్‌లెట్లు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఉన్నాయి. అక్కడ కొనుగోళ్లు జరపాలంటే నగదు అవసరం. అందుకే పార్లమెంట్ సభ్యులు ఎంత మొత్తంలోనైనా డబ్బును పార్లమెంటుకు తీసుకెళ్లవచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం, ఆంక్షలు లేవు. అయితే, సభ లోపల పెద్ద మొత్తంలో డబ్బును ప్రదర్శించడాన్ని మాత్రం నిషేధించారు. పార్లమెంటు లోపల డబ్బును ఉపయోగించడం లేదా ప్రదర్శించడం సభ గౌరవాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ నిషేధం అమలవుతోంది.

సభ లోపలకు ఏమేం తీసుకెళ్లవచ్చు?

ఎంపీలు తమ విధి నిర్వహణకు అవసరమైన వస్తువులను సభ లోపలకు తీసుకెళ్లవచ్చు. అలాగే నగదు కూడా తీసుకెళ్లవచ్చు. అయితే పర్సు (వ్యాలెట్)లో పట్టినంత మేర తీసుకెళ్లడాన్ని ఎవరూ తప్పుబట్టరు. ఒకవేళ అంతకు మించి తీసుకెళ్లినా సరే.. దాన్ని ప్రదర్శించి సభ పనితీరును ప్రభావితం చేయకుండా ఉంటే చాలు. మహిళా ఎంపీలు హ్యాండ్‌బ్యాగ్‌లు తీసుకెళ్లవచ్చు. కానీ అది వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాలెట్లు లేదా చిన్న బ్యాగ్‌లను తీసుకెళ్లడంపై ఎటువంటి పరిమితి లేదు, ఇవి ప్రొసీడింగ్‌లకు ఆటంకం కలిగించవు. వాటితో పాటు ఈ కింది వస్తువులను కూడా సభ లోపలకు తీసుకెళ్లవచ్చు.

పత్రాలు: శాసన ప్రయోజనాల కోసం అవసరమైన పత్రాలు, నివేదికలు లేదా బిల్లులు.

స్పీచ్ పేపర్: డిబేట్ లేదా డిస్కషన్‌లో పాల్గొనేందుకు సిద్ధం చేసిన స్పీచ్ పేపర్

ఎలక్ట్రానిక్ పరికరాలు: ఎంపీలు ముందస్తు అనుమతి తర్వాత మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లను తమ వెంట తీసుకెళ్లవచ్చు.

రిఫ్రెష్‌మెంట్స్: ప్రొసీడింగ్ సమయంలో నీరు, తేలికపాటి స్నాక్స్ (బిస్కెట్లు, చాక్లెట్ల వంటివి).

ఎలాంటివి తీసుకెళ్లకూడదు?

అసభ్యకరమైన లేదా అనుచితమైన అంశాలు: సభకు లేదా దాని కార్యకలాపాలకు అవమానకరంగా భావించే ఏదైనా ఖచ్చితంగా నిషేధించబడింది.

నిరసన మెటీరియల్: నిరసన కోసం ఉపయోగించే ప్లకార్డులు, పోస్టర్లు లేదా బ్యానర్లు వంటి వస్తువులను పార్లమెంటు లోపలికి తీసుకెళ్లకూడదు.

పెద్ద మొత్తంలో నగదు: నగదు కట్టలు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో తీసుకెళ్లి ప్రదర్శించడంపై నిషేధం ఉంది.

అనధికార ఎలక్ట్రానిక్ పరికరాలు: రికార్డింగ్ లేదా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఉపయోగించే పరికరాలను అనుమతి లేకుండా పార్లమెంట్ లోపలకు తీసుకెళ్లకూడదు. అలాగే మొబైల్ ఫోన్లలో ఉంటే కెమెరాను సభ లోపల ఉపయోగించకూడదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us