Kerala: కేరళలో భారీ వర్షాలు, 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ, మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం
కేరళలోని వయనాడ్ శవాలదిబ్బగా దర్శనమిస్తోంది. అటు వరదలు.. ఇటు రాకాసి కొండచరియలు మూడు గ్రామాలను ముంచేశాయి. మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వయనాడ్‌లో NDRF సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు.
దేవభూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. పర్యాటకుల స్వర్గధామం లాంటి ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. కేరళలోని వయనాడ్ శవాలదిబ్బగా దర్శనమిస్తోంది. అటు వరదలు.. ఇటు రాకాసి కొండచరియలు మూడు గ్రామాలను ముంచేశాయి. మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వయనాడ్‌లో NDRF సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు. స్థానిక మసీదులో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అటు సహాయక చర్యలను కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వర్షాలకు రహదారులు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ప్రకృతి రమణీయతకు మారుపేరుగా చెప్పుకునే కేరళ ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిపోతోంది. భూతల స్వర్గంగా పేరుగాంచిన భూమి.. ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే వంద మందికిపైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో ఈ ఘోర విపత్తు సంభవించింది. వరదలతో ఒక్కసారిగా విరుచుకుపడిన కొండచరియలతో మూడు గ్రామాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో చాలా మంది ప్రాణాలు ఇంకా మట్టి, బురద కిందే ఉండిపోయాయి. ఇప్పటికే వంద మందికిపైగా మృతదేహాలను వెలికితీయగా, ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. కాలికట్ మిలిటరీ బేస్ నుంచి IAF విమానంలో కోజికోడ్‌కు చేరుకున్నారు ఆర్మీ సిబ్బంది. మరోవైపు మిగ్ 17, ధృవ్ హెలికాప్టర్లను ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దించారు. వరద ముంపులో చిక్కుకున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. అలాగే గాయపడ్డవారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు ఆర్మీ అధికారులు. హెలికాప్టర్‌లో తీసుకొచ్చి.. క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చారు. అటు వయనాడ్‌లోని చలియార్ నది ఉధృతి కొనసాగుతుండటంతో నదిని దాటేందుకు బోట్లు సిద్ధం చేశారు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది.
వయనాడుతో పాటు కేరళలోని కోజికోడ్ , త్రిసూర్ , పాలక్కాడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వంతెనలు కుప్పకూలాయి..ఇళ్లు ధ్వంసమయ్యాయి. చర్చిలతో పాటు ప్రార్థనా స్థలాల్లోకి కూడా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు అధికారులు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేరళ మంత్రి శశీంద్రన్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కేరళకు 5 కోట్ల సాయం ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్. సహాయ చర్యల కోసం ఇద్దరు ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను వయనాడ్ పంపించారు. మరోవైపు కేరళకు చెందిన ఐదుగురు మంత్రులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అటు భారీ వర్షాలతో ఐదు జిల్లాలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..