India Rains: దక్షిణాది రాష్ట్రాలపై వరణుడి ప్రతాపం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..
India Rains: దక్షిణాది రాష్ట్రాలపై వరణుడి ప్రతాపం కొనసాగుతోంది. రోజుల తరబడి కురుస్తున్న వర్షాలతో... వరద ఉధృతి పెరిగి నదులు ఉప్పొంగుతున్నాయి.
India Rains: దక్షిణాది రాష్ట్రాలపై వరణుడి ప్రతాపం కొనసాగుతోంది. రోజుల తరబడి కురుస్తున్న వర్షాలతో… వరద ఉధృతి పెరిగి నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా వానల ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా కనిపిస్తోంది. వాగులు, వంకలు వంతెనల పైనుంచి పొంగి ప్రవహిస్తున్నాయి. కుట్రాళం జలపాతం ఉధృతంగా దూకుతోంది. వైగై జలాశయం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలన్నీ నీట మునిగాయి. సేలంలోని మెట్టూరు డ్యామ్‌కు కూడా భారీగా వరద చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాలు భయంభయంగా కాలం వెల్లదీస్తున్నాయి.
తిరుచ్చి, నామక్కళ్, సేలం జిల్లాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధం.. వరద పోటెత్తడంతో తిరుచ్చి, నామక్కళ్, సేలం జిల్లాల్లో 15కు పైగా గ్రామాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. శ్రీరంగం ఆలయం ఇప్పటికే నీట మునిగింది. దీంతో, భక్తులకు దర్శనానికి అనుమతించడం లేదు. పలు జిల్లాల్లో ఇప్పటికే18 నుంచి 20 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఆరు జిల్లాల్లో మరిన్ని భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రమాదపు అంచులో భవానీసాగర్.. నదులు ఉప్పొంగుతుండటంతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎక్కడ చూసినా డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయి. నిండు కుండలా మారిన భవానీసాగర్ ప్రమాదపు అంచుకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో పొల్లాచి ప్రాంతం పూర్తిగా ముంపునకు గురైంది. తమిళనాడులో వానలు బీభ్సతం సృష్టిస్తుండటంతో అలర్టయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. వర్షాలు, వరదలపై ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌లో సీఎం స్టాలిన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. వరద సహాయకచర్యలపై ఆరా తీశారు. కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు స్టాలిన్.
కర్నాటకలో ఎడతెరిపి లేని వానలు.. కర్నాటకలో కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరద ఉధృతికి వాగులు, వంకలు పోటెత్తాయి. జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరదలకు రోడ్లు, వంతెనలు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. బళ్లారి- హైదరాబాద్, రాయచూరు- బళ్లారి, బళ్లారి- బెంగళూరు మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది.
ఊటీపై ఉరుముతున్న వరణుడు.. ప్రముఖ పర్యాటన ప్రాంతం.. ఊటీని ఊపేస్తున్నాడు వరణుడు. అందమైన ప్రదేశం కాస్తా.. వరదల దెబ్బకు కకావికలమైంది. వర్షాలు,వానల కారనంగా.. పర్యాటకులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు అధికారులు.
కేరళలో ఆగని కుండపోత.. కేరళలో కూడా కుండపోత వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వరద ఉధృతితో.. 8 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నాన్‌స్టాప్ వర్షాలు.. అటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నాయి. వర్షాలు నాన్‌స్టాప్‌గా కురుస్తూనే ఉన్నాయి. కర్నప్రయాగ్‌లో భారీ వర్షాలకు కొండ పైనుంచి బండరాళ్లు పడడంతో బద్రీనాథ్ హైవే సెవెన్.. బ్లాకైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ వర్షాల బెడద ఇప్పట్లో తగ్గేలా లేదంటోంది వాతావరణ శాఖ. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని హెచ్చరికలతో.. లోతట్టు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..