Viral: ఎయిర్‌పోర్ట్‌లోని టాయిలెట్‌లో అనుమానాస్పద బ్యాగ్.. దాన్ని ఓపెన్ చేసి చూడగా..!
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు...
విమానాశ్రయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ యదేచ్చగా సాగుతోంది. అధికారులు ఎన్నిసార్లు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. కేటుగాళ్లు సినిమా క్రియేటివిటీతో విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలలో కస్టమ్స్ అధికారులు సుమారు రూ. 3.09 కోట్లు విలువ చేసే బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో ఆగష్టు 3,4 తేదీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి దగ్గర నుంచి రెండు బంగారు గొలుసులను, పేస్ట్ రూపంలో ఉన్న కేజీ గోల్డ్‌తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విమానాశ్రయంలోని టాయిలెట్‌లో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించారు పోలీసులు. అందులో పేస్ట్ రూపంలో ఆరు ప్యాకెట్ల బంగారం లభ్యం కాగా.. అది 6.5 కిలోలు బరువుండగా.. దాని విలువ సుమారు రూ. 3.09 కోట్లు ఉంటుందని అంచనా.
కాగా, మే నెలలో కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 72.4 లక్షల విలువైన బంగారం, గొలుసులు, వివిధ రకాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితులైన ఇద్దరు శ్రీలంక పౌరులను మే 28వ తేదీన కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.