HMPV కేసులపై సర్కార్ అప్రమత్తం.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అలర్ట్..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
HMPV వైరస్.. చాపకింద నీరులా...మనల్నికబళించేందుకు చైనా నుంచి చాలా స్పీడ్‌గా వచ్చేసింది. ఒకటి రెండు మూడు నాలుగు..ఇలా లెక్కపెడుతున్నకొద్దీ పెరుగుతూ పోతున్నాయి కేసులు. నమోదైన కేసులన్నీ కేవలం చిన్నపిల్లలవే. 13ఏళ్ల పిల్లలపైనే తన ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో అధికారికంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయినా చైనా వైరస్‌ను లైట్‌గా తీసుకునేదానికి లేదు. దాని ప్రభావానికి స్టాక్‌మార్కెట్లు పతాళానికి పడిపోయాయి. కాగా, ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇంతకూ మరోసారి కొవిడ్-19రోజులు రానున్నాయా... ? ఇండియాలో లాక్‌డౌన్ తప్పదా...?
దేశంలో HMPV వైరస్ కలకలం: బయటకు వెళితే మాస్క్ పెట్టుకోవాలి. ఎవరినైనా టచ్ చేస్తే శానిటైజర్ రాసుకోవాలి. మనిషిని చూసి మనిషి భయపడుతూ బతికిన కాలం అది. కలి కాలం కంటే ఘోరమైన కరోనా కాలం. ఆ కరోనా కాలాన్ని గుర్తుస్తూ ప్రజల్ని హడలెత్తిస్తోంది HMPV వైరస్ అలియాస్ హ్యుమన్ మెటానిమో వైరస్. నిన్నటిదాకా చైనాను వణికించిన HMPV వైరస్ ఇప్పుడు ఇండియాలో అడుగు పెడుతూనే విజృంభించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 HMPV వైరస్ కేసులు నమోదైనట్టుగా తెలిసింది. ఇందులో రెండు కర్ణాటక రాజధాని బెంగళూరులో, మరో కేసును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుర్తించారు. కోల్‌కతాలో ఐదు నెలల చిన్నారికి.. HMPV పాటిజివ్‌గా తేలింది. బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలగా.. అహ్మదాబాద్‌లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కర్ణాటకలో పెరుగుతున్న వైరస్ కేసుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు సూచించింది కర్నాటక ప్రభుత్వం.
తెలంగాణ సర్కార్ అప్రమత్తం..
HMPV వైరస్ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల డేటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది. తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కడా లేవని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్ ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్..
ఇక HMPV వైరస్ వ్యాప్తిపై అటు, ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. అధికారులతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి కొత్తగా వచ్చే వాళ్లపై దృష్టి పెట్టాలని, అనుమానం ఉంటే వైద్య పరీక్షలు జరపాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి ఆస్పత్రిలో ముందుగానే 20 బెడ్స్ ఐసోలేట్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టుగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు.
చైనాలో వైరస్ విజృంభణ..
చైనాలో మాత్రం HMPV వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. కేసుల వేగం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశమైంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్‌లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని సమావేశంలో నిపుణులు తెలిపారు. చైనాలో జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. WHO కూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ ఫ్లూయెంజా, RSV, HMPV వంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. భారత్‌లో HMPV వైరస్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల RSI, HMPV వంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక వేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
పాత వైరస్…సరికొత్త భయాలు
HMPV వైరస్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఈ వైరస్ కొత్తది కాదని, 2001 లోనే దీన్ని గుర్తించారన్నారు. పొరుగుదేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. HMPV వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ICMR, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. చైనాలో పరిణామాలను గమనిస్తున్నామని త్వరలో WHO రిపోర్ట్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.