Earthquake: గంటల వ్యవధిలో 19 సార్లు భూప్రకంపనలు.. ఇళ్ల నుండి పరుగులు తీసిన జనాలు..
ఒకసారి భూమి కంపిస్తే మనం హడలిపోతాం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాం. అలాంటిది కొన్ని గంటల వ్యవధిలోనే..

Earthquake: ఒకసారి భూమి కంపిస్తే మనం హడలిపోతాం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాం. అలాంటిది కొన్ని గంటల వ్యవధిలోనే అనేకసార్లు భూమి కంపిస్తే.. అక్కడి ప్రజల పరిస్థితి ఎలాంటి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పలేం. గుజరాత్ రాష్ట్రంలో అదే జరిగింది. గిర్‌సోమనాథ్ జిల్లాలో సోమవారం నాడు ఉదయం నుండి 19 సార్లు భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్లపై ఉండిపోయారు. అయితే భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
గుజారాత్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ డైరెక్టర్ సుమర్ చోప్రా దీనిపై స్పందించారు. దీనిని రుతుపవనాల ప్రేరిత భూకంపంగా పేర్కొన్నారు. సాధారణంగా గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో రెండు-మూడు నెలలగా భారీ వర్షపాతం కురిసిందని, దాని ఫలితంగా ఈ భూ ప్రకంపనలు వచ్చాయన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాగా, భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.7 నుండి 3.3 మధ్య నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇక భూకంప కేంద్రం గిర్‌సోమనాథ్ జిల్లాలోని తలాల ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు చెప్పారు.