Rahul Gandhi: దేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు.. పార్లమెంటు లోపలే మట్లాడతా: రాహుల్

లండన్ పర్యటనలో భాగంగా.. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తొలిసారి స్పందించారు.

Rahul Gandhi: దేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు.. పార్లమెంటు లోపలే మట్లాడతా: రాహుల్
Rahul Gandhi
Follow us

|

Updated on: Mar 16, 2023 | 4:09 PM

లండన్ పర్యటనలో భాగంగా.. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తొలిసారి స్పందించారు. తాను భారతదేశానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని.. అవకాశమిస్తే పార్లమెంటు లోపల మాట్లాడతానంటూ రాహుల్ గాంధీ లండన్ ప్రసంగంపై క్లారిటీ ఇచ్చారు. గురువారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తూ.. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కేంబ్రిడ్జి వేదికగా ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారంటూ రాహుల్ గాంధీ పేర్కొన్న అంశాలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశీ గడ్డపై రాహుల్ భారత్ పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించారంటూ బీజేపీ చేస్తోన్న ఆరోపణలపై స్పందిస్తారా..? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాహుల్ స్పందించారు. తానేమీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. ఒకవేళ అనుమతిస్తే సభలో మాట్లాడతానని, అవకాశం ఇవ్వకపోతే పార్లమెంట్‌ బయట మాట్లాడతాను అంటూ రాహుల్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్‌లో విజిటింగ్ ఫెలో అయిన రాహుల్ గాంధీ మార్చి 1న ‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21 సెంచరీ’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత ప్రజాస్వామ్యంతోపాటు రాహుల్ కీలక అంశాల గురించి ప్రస్తావించారు. మీడియా, న్యాయవ్యవస్థపై పట్టు, నియంత్రణ, నిఘా -బెదిరింపులు, చట్ట వ్యతిరేక చర్యలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులు, అణిచివేత, అసమ్మతి గురించి మాట్లాడారు.

మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. రాహుల్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యతిరేకశక్తుల మాదిరి ఆయన మాట్లాడారంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..