Serum Institute Vaccine: రూ.200కే వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్‌తో కేంద్ర ప్రభుత్వం డీల్
Serum IInstitute Vaccine: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది...

Serum Institute Vaccine: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు దిగింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ టీకా డోసులు కొనుగోలు, అందుబాటులో ధరలో టీకాను అందించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం డీల్‌కు సిద్ధమవుతోంది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని సీరం ఇనిస్టిట్యూట్ తాజాగా ధృవీకరించినట్లు సమాచారం. ఈ డీల్ తర్వాత వ్యాక్సిన్ ధర రూ.200 ఉంటుందని సీరం వర్గాలు ప్రకటించాయి. ప్రారంభ దశలో తొలి 100 మిలియన్ మోతాదులను రూ.200లకే అందిస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం 11 మిలియన్ల టీకాలను అందిస్తామన్నారు. అంతేకాకుండా సోమవారం రాత్రి, లేదా రేపు ఉదయానికి టీకాల రవాణా మొదలవుతుందని తెలిపింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు గతవారమే కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వారికే తొలి ప్రాధాన్యం
కాగా, కరోనా వ్యాక్సిన్ అందించడంలో తొలి ప్రాధాన్యత కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:
South Africa COVID-19 Vaccines: కరోనా వ్యాక్సిన్ రహస్య ప్రదేశంలో నిల్వ చేయనున్న దక్షిణాఫ్రికా
New Strain Virus: బ్రెజిల్ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్ వైరస్.. గుర్తించిన జపాన్ ఆరోగ్యశాఖ




