AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Dalit Jodo: ఖర్గేకు అధ్యక్ష పీఠం.. కాంగ్రెస్ ‘దళిత్ జోడో’ వ్యూహం..

చరిత్రలో ఎన్నడూ లేనంతగా బలహీనపడ్డ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఆ పార్టీ ప్రధాన నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రతో పాటు.

Congress Dalit Jodo: ఖర్గేకు అధ్యక్ష పీఠం.. కాంగ్రెస్ ‘దళిత్ జోడో’ వ్యూహం..
Mallikarjun Kharge And Sonia Gandhi
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Oct 23, 2022 | 7:19 PM

Share

చరిత్రలో ఎన్నడూ లేనంతగా బలహీనపడ్డ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఆ పార్టీ ప్రధాన నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రతో పాటు దశాబ్దాలుగా తమకు వెన్నుదన్నుగా నిలిచి, ఇప్పుడు వేర్వేరు పార్టీల వెంట నడుస్తున్న దళిత ఓటు బ్యాంకును మళ్లీ హస్తగతం చేసుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన దళిత నేత మల్లికార్జున ఖర్గేను అస్త్రంగా మలచుకోవాలని చూస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాంగ్రెసేతేర రాజకీయ పార్టీల వెంట నడస్తున్న దళితులను పూర్తిగా తమవైపు ఆకట్టుకోవాలని చూస్తోంది.

137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు సారథ్యం వహించిన దళిత నేతలు దామోదరం సంజీవయ్య, బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మల్లికార్జున ఖర్గే రూపంలో ఆ వర్గానికి అత్యున్నత పార్టీ పదవి లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేవలం దళిత నేతగా మాత్రమే ఆయన్ను ప్రస్తావిస్తే మిగతావర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, అలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా ప్రణాళికలు రచిస్తోంది.

ఏఐసీసీ ఎస్సీ సెల్‌లో సమూల మార్పులు..

ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గే గెలుపొందిన తర్వాత పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగం చైర్మన్ రాజేష్ లిలోథియా మొత్తం సంస్థ కార్యవర్గాన్ని రద్దు చేశారు. ఖర్గే సూచనల మేరకు బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త ఆఫీస్ బేరర్ల నియామకం జరపనున్నారు. ఈ కసరత్తు చేపట్టే ముందు పార్టీ దేశం నలుమూలల నుంచి దళిత సమాజం, అందులోని వివిధ కులాలు, ఉపకులా సమగ్ర సమాచారాన్ని బూత్‌ల వారీగా సేకరించనుంది. ఈ డేటా ఆధారంగా ఆయా కులాల సంఖ్యబాలం, ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయి నుంచి నియామకాలు చేపట్టాలని చూస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు జాతవ్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఆ వర్గానికే నాయకత్వం అప్పగించడం, వాల్మీకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారికి పగ్గాలు అప్పగించడం వంటి చర్యల ద్వారా ఖర్గే మార్కు మార్పులు జరుగుతున్నాయన్న సంకేతాన్ని దళిత సామాజికవర్గంలో పంపొచ్చని, మౌత్ పబ్లిసిటీ ద్వారా దళిత సమాజం మళ్లీ దగ్గరవుతుందని భావిస్తోంది. బూత్ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పార్టీ సదస్సులు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మొత్తం కసరత్తు బాధ్యతను ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేశ్ లిలోథియాకు అప్పగించారు. ఖర్గేకు దళిత నాయకుడనే ట్యాగ్ రాకుండా ఉండడం కోసం పార్టీ నిర్వహించే సదస్సుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఓటు బ్యాంకు పటిష్టపరిచే వ్యూహాలు..

మరోవైపు ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో చేసిన తీర్మానం ప్రకారం ఏఐసీసీ నాయకత్వ కూర్పులోనూ దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు 50 శాతం చోటు కల్పించనున్నట్టు తెలిసింది. గాంధీ కుటుంబం, వారి సలహాదారులతో సమావేశమైన తర్వాత ఈ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంది. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా తీసుకున్న చివరి నిర్ణయం సైతం ఉత్తర్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా దళిత నేత బ్రిజ్‌లాల్ ఖబ్రీని నియమించడం చూస్తుంటే గాంధీ కుటుంబం, వారి సలహాదారులు ‘దళిత్ జోడో’ వ్యూహాన్ని ఇప్పటికే అనుసరించడం మొదలుపెట్టారని అర్థమవుతోంది.

జన సంఖ్య ప్రకారం దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత బహుజనుల కోసం ఏర్పడ్డ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కాంగ్రెస్ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బకొట్టింది. ఇప్పుడు బీఎస్పీ సైతం బలహీనపడ్డ తరుణంలో ఆ ఓటర్లు భారతీయ జనతా పార్టీ వెంట నడవకుండా తమవైపు ఆకట్టుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం చూస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా దళిత ఓటర్లను తమవైపు ఆకట్టుకోవడం కోసం బీజేపీ సైతం గతంలో రాష్ట్రపతి పదవిని దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. అలాగే గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో శరవేగంగా కాషాయ జెండాను విస్తరించేందుకు గిరిజన నేత ద్రౌపది ముర్ముకు భారత రాష్ట్రపతి పదవి కట్టబెట్టి వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్న బీజేపీకి బ్రేకులు వేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. బీజేపీ అమలు చేస్తున్న దళిత, గిరిజన వ్యూహాలను తిప్పికొట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని బలంగా ఢీకొట్టి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..