AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra: కేదార్‌నాథ్‌‌లో విరిగిపడుతున్న మంచు పర్వతాలు.. తాత్కాలికంగా యాత్ర నిలిపివేత..

ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు చరియలు విరిగి పడుతున్నాయి. చార్‌ధామ్‌కి వెళ్ళే మార్గంలో భారీ మంచుకొండ విరిగి పడడంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు.

Char Dham Yatra: కేదార్‌నాథ్‌‌లో విరిగిపడుతున్న మంచు పర్వతాలు.. తాత్కాలికంగా యాత్ర నిలిపివేత..
Kedarnath Snow Fall
Surya Kala
|

Updated on: May 05, 2023 | 6:48 AM

Share

ఉత్తరాఖండ్‌లో ఏకంగా కొండలే కూలిపోతున్నాయి. ఓ వైపు మంచు, మరోవైపు వర్షాలు ఉత్తరాఖండ్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. చార్‌ధామ్‌ వెళ్ళే మార్గంలో భారీ కొండచరియ విరిగిపడడంతో జనం ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో పాటు మంచు కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రికులకు తీవ్ర అడ్డంకులేర్పడ్డాయి. చార్‌ధామ్‌ యాత్రాప్రదేశాల్లో అనేక చోట్ల మంచు చరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో భారీ మంచు పర్వతం బద్దలై ప్రవహిస్తోంది. రెండ్రోజుల క్రితం భైరవి, కుబేర్‌ మంచు చరియలు విరిగి పడ్డాయి. తాజాగా మరోసారి భారీగా మంచు చరియలు విరిగి కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్ళే యాత్రికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కేదార్‌నాథ్‌ ఆలయ ప్రాంతంలో మంచుప్రభావం తీవ్రంగా ఉండడం, మరోవైపు మంచుపర్వతాలు విరిగి పడుతుండడంతో యాత్రికులను తాత్కాలికంగా ఆపివేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి రక్షణచర్యలు చేపట్టారు.

మార్గంమధ్యలో చిక్కుకుపోయిన నలుగురు నేపాలీ పోర్టర్స్‌ని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. వారంతా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కేదార్‌నాథ్‌ యాత్ర నిలిచిపోవడంతో యాత్రికులు రిషికేష్‌, శ్రీనగర్‌, ఫతా, సోన్‌ప్రయాగ్‌లలో వేచి ఉండాలని అధికారులు వెల్లడించారు. మంచు ప్రభావం తీవ్రంగా ఉండడంతో వయో వృద్ధులు, పిల్లలు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావం కారణంగా రుద్రప్రయాగ్‌ జిల్లా అధికార యంత్రాంగం కేదార్‌నాథ్‌ పర్యాటకులు ఎక్కడివారక్కడే తాత్కాలికంగా నిలిచిపోవాలని కోరారు. వాతావరణం మెరుగుపడ్డాక మాత్రమే మంచుని పూర్తిగా తొలగించే అవకాశం ఉందని, అప్పుడే యాత్రికులను అనుమతిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..