CM KCR: మహారాష్ట్రపై కన్నేసిన సీఎం కేసీఆర్.. పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న బీఆర్ఎస్ అధినేత రెండు రోజుల పర్యటన..
BRS Chief KCR Solapur Tour: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత్ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు.. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.
BRS Chief KCR Solapur Tour: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత్ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు.. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. పలు రాష్ట్రాల్లో తమతో కలిసి వచ్చే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాకుండా పార్టీ చేరికలు, రాజకీయ వ్యూహాలు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పక్క రాష్ట్రం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను బలమైన పార్టీగా మార్చేందుకు సన్నాహాలను ప్రారంభించారు. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను ప్రారంభించిన కేసీఆర్.. చేరికలను ఇంకా ముమ్మరం చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో (సోమవారం, మంగళవారం) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి మహారాష్ట్ర సోలాపూర్ కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు సైతం భారీ కాన్వాయ్‌గా రోడ్డు మార్గన తరలివెళ్లనున్నారు. దాదాపు 500ల వాహనాల్లో మహారాష్ట్ర గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు తరలివెళ్లనున్నారు.
సోమవారం రాత్రి అక్కడే బస చేయనున్న సీఎం కేసీఆర్.. పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలతో మాట్లాడనున్నారు. దీంతోపాటు.. పలువురు ప్రముఖులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం ఉదయం సోలాపూర్ జిల్లాలో పండరిపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరికలు కూడా జరగనున్నాయి. సోలాపూర్ కు చెందిన ప్రముఖ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతారని పేర్కొంటున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్న కేసీఆర్.. మధ్యలో దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
కాగా.. అంతకుముందు సీఎం కేసీఆర్ వరుస పర్యటనలపై ఎన్సీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటన మరోసారి మహా పాలిటిక్స్ లో హీటు పుట్టిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..