Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త రాజకీయ వ్యూహం.. మహిళకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు..? రేసులో ఆ ముగ్గురు..!

దేశవ్యాప్తంగా పుల్‌ స్వింగ్‌లో ఉంది కమలం పార్టీ..! వరుసబెట్టి విజయాలు సాధిస్తూ.. ఓ రేంజ్‌లో హవా కంటిన్యూ చేస్తోంది. మరి అలాంటి పార్టీకి కాబోయే కొత్త చీఫ్‌ ఎవరు..? అమిత్‌షా, రాజ్‌నాథ్, నడ్డా లాంటి అగ్రనేతల తర్వాత ఆ పీఠాన్ని ఎక్కబోయే నాయకుడెవరు..? అన్నదీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురిలో ఎవరా బిగ్ లక్కీ హ్యాండ్..?

సరికొత్త రాజకీయ వ్యూహం.. మహిళకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు..? రేసులో ఆ ముగ్గురు..!
Nirmala Sitharaman, Vanathi Srinivasan, Daggubati Purandeswari
Balaraju Goud
|

Updated on: Jul 04, 2025 | 10:11 AM

Share

దేశవ్యాప్తంగా పుల్‌ స్వింగ్‌లో ఉంది కమలం పార్టీ..! వరుసబెట్టి విజయాలు సాధిస్తూ.. ఓ రేంజ్‌లో హవా కంటిన్యూ చేస్తోంది. మరి అలాంటి పార్టీకి కాబోయే కొత్త చీఫ్‌ ఎవరు..? అమిత్‌షా, రాజ్‌నాథ్, నడ్డా లాంటి అగ్రనేతల తర్వాత ఆ పీఠాన్ని ఎక్కబోయే నాయకుడెవరు..? అన్నదీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురిలో ఎవరా బిగ్ లక్కీ హ్యాండ్..?

హ్యాట్రిక్‌ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్‌ కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులకందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది. మరలాంటి కాషాయ పార్టీకి కాబోయే బాస్‌ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డా తర్వాత జాతీయాధ్యక్షుడిగా ఎవరు వస్తారని అటు పార్టీతో పాటు ఇటు దేశ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే జూలై రెండో వారంలో బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తవ్వడం.. జాతీయ అధ్యక్ష ఎన్నికకు అవసరమైన కోరం ఉండటంతో.. బీజేపీ చీఫ్‌ ఆన్‌ ద వే అన్న టాక్‌ ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది.

బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ముందు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి. అయితే ఇప్పటివరకు 28 రాష్ట్రాల్లో విజయవంతంగా అంతర్గత సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇంటర్నల్ ఎలక్షన్ ఈ వారం పది రోజుల్లో పూర్తవుతుంది. ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈసారి పార్టీ పెద్ద మార్పు వైపు పయనిస్తోంది. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని ఒక మహిళకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పార్టీ మంచి పనితీరును కనబరిచింది. ఈ కారణంగా, ఒక మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షించడానికి, ఒక మహిళను పార్టీ అధ్యక్షురాలిగా చేయవచ్చని తెలుస్తోంది.

నిజానికి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా పదవీకాలం జనవరి 2023లో ముగిసింది, కానీ పార్టీ అతనికి జూన్ 2024 వరకు మరిన్ని బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు కొత్త పేరును త్వరలో ప్రకటించవచ్చు. తదుపరి పార్టీ అధ్యక్షురాలు మహిళ కావచ్చు. దీనికి ముగ్గురి పేర్లు ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ లలో ఎవరినైనా ఒకరు బీజేపీ బాధ్యతలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

నిర్మల సీతారామన్

ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీలో బలమైన పట్టును ఏర్పరచుకున్నారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె ఇటీవల బీజేపీ ప్రధాన కార్యాలయంలో జెపి నడ్డా, జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్‌లతో సమావేశమయ్యారు. ఆమె దక్షిణ భారతదేశం నుండి రావడం బీజేపీ మరింత విస్తరణకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.

వానతి శ్రీనివాసన్

వానతి తమిళనాడులోని కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వానతి 1993 నుండి బీజేపీలో ఉన్నారు. పార్టీలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పోటీలో ఆమె ముందున్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి

డి. పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షురాలుగా పని చేశారు. రాజకీయంగా చాలా అనుభవజ్ఞురాలైన నాయకురాలు. గతంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె ఆపరేషన్ సింధూర్ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పురందేశ్వరిని చాలా విశ్వసిస్తుంది. అందువల్ల, ఆమె పేరును కూడా ఆమోదించవచ్చని తెలుస్తోంది.

కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పలువురు కేంద్రమంత్రుల పేర్లు సైతం చర్చకు రావడంతో.. కేంద్ర కేబినెట్‌లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చాక.. జూలై రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరా లక్కీ మ్యాన్‌ అన్నది తేలాలంటే ఓ వారం పదిరోజులు ఆగాల్సిందే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..