నిమ్మకాయ నీళ్లు తాగితే బీపీ తగ్గుతుందా.. అసలు వాస్తవం ఏంటీ..?
Lemon Water: నిమ్మకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నిమ్మకాయ సీ విటమిన్‌కు నిలయం. నిమ్మనీరు తాగితే శరీరానికి ఎంతో మంచిది అని వైద్యులు చెబుతారు. అయితే నిమ్మకాయ నీళ్లు తాగితే బీపీ తగ్గుతుందని ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారు..? అనేది తెలుసుకుందాం..

హై బీపీ.. దీన్ని వైద్యులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎటువంటి లక్షణాలు లేకుండానే ఇది గుండె, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఉదయాన్నే నిమ్మరసం తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది అనే వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ స్వరాజ్ పాల్ దీనిపై ఏమంటున్నారో తెలుసుకుందాం.
నిమ్మరసం – వాస్తవాలు
నిమ్మకాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రక్త నాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయనేది నిజం. నిమ్మలోని పోషకాలు రక్త నాళాలు సరళంగా ఉండటానికి దోహదపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా రక్త ప్రసరణను, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
బీపీని తగ్గిస్తుందా?
నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అది రక్తపోటును తగ్గిస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ స్వరూప్ స్వరాజ్ పాల్ స్పష్టం చేశారు. నిమ్మరసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది తప్ప.. అది వైద్యులు సూచించే బీపీ మందుల మాదిరిగా పనిచేయదు. ఒక గ్లాసు నిమ్మరసం తాగుతున్నాం కదా అని బీపీ మందులను ఆపడం లేదా క్రమం తప్పకుండా చేసే ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు.
అతిగా తాగితే ముప్పే!
నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని భావించి అతిగా తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం దంతాల పైపొరను క్రమంగా కరిగించివేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లేదా కడుపు నొప్పితో బాధపడేవారికి నిమ్మరసం సమస్యను మరింత పెంచుతుంది.
నిపుణుల సలహా
బీపీని నియంత్రణలో ఉంచుకోవాలంటే కేవలం నిమ్మరసం వంటి ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ క్రమం తప్పకుండా ఆరోగ్య చెకప్స్ చేయించుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




