AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDA Strategy: టార్గెట్ 2024.. చిన్న పార్టీలు.. చింతలేని కూటమి.. కమలనాథుల ఎన్డీఏ వ్యూహం ఇదేనా..?

NDA - Small Party Strategy : బెంగళూరులో 26 రాజకీయ పార్టీలతో జరిగిన ప్రతిపక్షాల 2వ సమావేశానికి పోటీగా అధికార కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఏకంగా 38 పార్టీలతో అదే రోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశాన్ని జరిపింది.

NDA Strategy: టార్గెట్ 2024.. చిన్న పార్టీలు.. చింతలేని కూటమి.. కమలనాథుల ఎన్డీఏ వ్యూహం ఇదేనా..?
Nda Meeting
Mahatma Kodiyar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 20, 2023 | 7:39 AM

Share

NDA – Small Party Strategy : బెంగళూరులో 26 రాజకీయ పార్టీలతో జరిగిన ప్రతిపక్షాల 2వ సమావేశానికి పోటీగా అధికార కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఏకంగా 38 పార్టీలతో అదే రోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశాన్ని జరిపింది. ఈ రెండు కూటముల సమావేశాలు పోటా పోటీ బల ప్రదర్శనగానే కనిపించాయి. ఎన్డీఏ కూటమిలో పార్టీల సంఖ్య చూస్తే పెద్దగా కనిపిస్తున్నప్పటికీ, వాటిలో కనీసం ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలే 24 ఉన్నాయంటూ ఎద్దేవా కూడా మొదలైంది. ప్రతిపక్షాల ఐక్యతను చూసి అధికారపక్షం భయపడుతోందని, అందుకే చిన్న పార్టీలు, తోక పార్టీలను కలుపుకుని పోటీ ప్రదర్శన చేపట్టిందని విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే కాస్త లోతుగా తరచి చూస్తే ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలను కాకుండా చట్టసభల్లో ప్రాతినిథ్యం కూడా లేని చిన్న పార్టీలను బీజేపీ జతకలపుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందని అర్థమవుతోంది.

కొద్ది మొత్తంతోనే ఫలితాలు తారుమారు..

లోక్‌సభ ఎన్నికలైనా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలైనా అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కొద్ది శాతం ఓట్లే. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ మార్జిన్‌తో కొందరు గట్టెక్కుతుండగా, ఆ కొద్ది తేడాతోనే మరికొందరు విజయాన్ని అందుకున్నట్టే అందుకుని చేజార్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కలిసొచ్చే ప్రతి ఓటూ విలువైనదే అన్న చందంగా అదనంగా చేరే 1 శాతం ఓటుబ్యాంకు కూడా పార్టీలకు అత్యంత కీలకంగా మారుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న 38 పార్టీల్లో తమిళనాడులోని ఏఐఏడీఎంకే (అన్నా డీఎంకే), మహారాష్ట్రలోని శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) వంటివి మాత్రమే చట్టసభల్లో సంఖ్యాబలం ప్రకారం కాస్త బలంగా కనిపిస్తున్న పార్టీలు. ఇవి మినహా ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన సహా మిగతా పార్టీల ప్రాతినిథ్యం చట్టసభల్లో చాలా తక్కువ. అయినప్పటికీ ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటుబ్యాంకు ఉంది. పార్టీలు తమకంటూ కొన్ని సామాజిక వర్గాల్లో గట్టి పట్టు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ‘జనసేన’ పార్టీనే పరిగణలోకి తీసుకున్నా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో కలిసి పోటీ చేసి మొత్తంగా సుమారు 6 శాతం ఓట్లను సంపాదించుకుంది. విడిగా చూస్తే ‘కాపు’ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పార్టీ ఓట్ల శాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈసారి ‘కాపు’ సామాజికవర్గంలో ఐక్యత కనిపిస్తోందని, ఫలితంగా జనసేన బలం 10 శాతం పైనే ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ తరహాలోనే లోక్ జనశక్తి, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా వంటి బిహార్ రాజకీయ పార్టీలకు ఆ రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాల్లో పట్టుంది. ఉత్తర్‌ప్రదేశ్ లో అప్నాదళ్‌కు ‘కుర్మి’ సామాజికవర్గంలో గట్టి పట్టు ఉండగా, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్‌భర్‌కు ఓబీసీల్లోని రాజ్‌భర్ సామాజికవర్గంలో గట్టి పట్టుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోని అనేక సామాజికవర్గాల్లో పట్టున్న చిన్న పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యపక్షాలుగా కనిపిస్తున్నాయి. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న ఓబీసీల్లో పట్టు బిగించి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న బీజేపీ, దళితులు, గిరిజనులు చివరకు ముస్లిం వర్గాల్లోనూ నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన ఉపవర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలకు కూటమిలోని చిన్న పార్టీలే పెద్ద ఆసరాగా మారుతున్నాయి.

క్విడ్ ప్రో కో ప్రయోజనాలు..

చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి అదనపు ఓటు బ్యాంకు చేరడమే కాదు.. ఎన్నికల సమయంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు దగ్గర పేచీలు, అలకలకు ఆస్కారం కూడా తక్కువే ఉంటుంది. బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే సీట్లలో సింహభాగాన్ని ఆ పార్టీకే ఇచ్చి, వాళ్లిచ్చే కొన్ని సీట్లతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే పేచీలకు మహారాష్ట్రలోని శివసేన ఉదాహరణగా నిలుస్తోంది. చెరి సగం సీట్లు పంచుకుని బీజేపీ – శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, శివసేన కంటే రెట్టింపు సంఖ్యలో బీజేపీ గెలుపొందింది. ఫలితాల అనంతరం పేచీ పెట్టిన శివసేన చివరకు తాను ఓడించిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో ఏపీలో తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అయితే 2018లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏను వీడి కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. ఇలాంటి కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కమలనాథులు బలమైన ప్రాంతీయ పార్టీల కంటే చిన్న పార్టీలే నయం అనుకుంటున్నారు. అదే చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తే.. ఆ పార్టీలకు కూడా బీజేపీ బలం తోడై చట్టసభల్లో ప్రాతినిథ్యం లభిస్తుంది. ఎన్నికల్లో ఆ కూటమి గెలుపొందితే సమీకరణాలు కూడా తోడైతే వారికి మంత్రివర్గంలోనూ చోటు దక్కుతుంది. ఫలితంగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న సమూహాలు, సామాజికవర్గాలకు రాజ్యాధికారం ద్వారా చేయదల్చుకున్న పనులు చేసి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతిపక్షాల హేళన, ఎద్దేవాను ఎన్డీఏ కూటమి పట్టించుకోకుండా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..