AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru Water Crisis: బెంగళూరులో గుక్కెడు నీళ్ల కోసం కటకట.. ఒక్కో వాటర్‌ క్యాన్‌ ధర రూ.2 వేలకు పైమాటే!

వేసవి ఆరంభంలోనే బెంగ‌ళూర్‌లో నీటి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. గుక్కెడు తాగునీటి కోసం నగరవాసులు కటకటలాడుతున్నారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవ‌డంతో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. స్ధానికులు నీటి కోసం వాట‌ర్ ట్యాంక‌ర్లపై ఆధార‌ప‌డ‌టంతో.. ఇదే అదనుగా కొందరు ప్రైవేట్‌ ట్యాంకర్లు ఇష్టారీతిన అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో వాటర్‌ క్యాన్‌కు రూ.600 నుంచి రూ. వెయ్యి రూపాయలు ప్రైవేట్‌ ట్యాంకర్లు ప్రస్తుతం ఏకంగా రూ.2 వేలకు పెంచాయి..

Bengaluru Water Crisis: బెంగళూరులో గుక్కెడు నీళ్ల కోసం కటకట.. ఒక్కో వాటర్‌ క్యాన్‌ ధర రూ.2 వేలకు పైమాటే!
Bengaluru Water Crisis
Srilakshmi C
|

Updated on: Mar 07, 2024 | 4:44 PM

Share

బెంగళూరు, మార్చి 7: వేసవి ఆరంభంలోనే బెంగ‌ళూర్‌లో నీటి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. గుక్కెడు తాగునీటి కోసం నగరవాసులు కటకటలాడుతున్నారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవ‌డంతో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. స్ధానికులు నీటి కోసం వాట‌ర్ ట్యాంక‌ర్లపై ఆధార‌ప‌డ‌టంతో.. ఇదే అదనుగా కొందరు ప్రైవేట్‌ ట్యాంకర్లు ఇష్టారీతిన అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో వాటర్‌ క్యాన్‌కు రూ.600 నుంచి రూ. వెయ్యి రూపాయలు ప్రైవేట్‌ ట్యాంకర్లు ప్రస్తుతం ఏకంగా రూ.2 వేలకు పెంచాయి. ధరలు తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరడంతో అసలు ప్రాంతానికి రావడమే మానేశారు. దీంతో స్థానికులు ప్రతిరోజూ నీళ్ల కోసం ఆర్‌ఓ ప్లాంట్‌కు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో క్యాన్‌ చొప్పున మాత్రమే ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

నీటి కోసం పొడ‌వాటి క్యూల్లో గంటల కొద్ది వేచి ఉండాల్సి వ‌స్తోంద‌ని ఆర్ఆర్ న‌గ‌ర్ వాసులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించ‌డం లేద‌ని, కొద్దిపాటి నీటితోనే ఇంట్లో వారంతా స‌ర్దుకోవాల్సి వస్తోంద‌ని వాపోతున్నారు. స్నానం చేసేందుకు, వంట చేసుకునేందుకు కూడా త‌గినంత నీరు ఉండ‌టం లేద‌ని అన్నారు. వంట చేసేందుకు కార్పొరేషన్‌ నీటిని వినియోగించుకోవాల్సి వస్తోందని, ఆ నీటిని వడపోసి మరిగించి.. తాగేందుకు వినియోగిస్తున్నట్లు ఆర్ఆర్ న‌గ‌ర్‌కు చెందిన మ‌హిళ దివ్య నీటి క‌ష్టాల‌ను ఏక‌రువు పెట్టారు. గ‌త మూడు నెల‌లుగా నీటి కొర‌త వెంటాడుతోంద‌ని, తాము నిత్యం బీఎండ‌బ్ల్యూఎస్ఎస్‌బీ (బెంగ‌ళూర్ నీటి స‌ర‌ఫ‌రా, సీవ‌రేజ్ బోర్డ్‌) అధికారికి ఫోన్ చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని చెప్పారు. కనకపుర రోడ్‌లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్‌మెంట్స్ నివాసితులు నీటిని పొదుపు చేయడానికి పునర్వినియోగించలేని వస్తువులను ఉపయోగించాలని కోరింది. నీటి సంక్షోభాన్ని పర్యవేక్షించేందుకు వైట్‌ఫీల్డ్‌లోని మరో సొసైటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించకుంటే రూ.5,000 జరిమానా విధించాలని వారు నిర్ణయించారు.

మరోవైపు బెంగళూరులోని నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్యాంకర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత వారం చెప్పారు. సమస్య పరిష్కారానికి BWSSB, BBMP (బృహత్ బెంగళూరు మహానగర పలికే) సభ్యులు సమావేశమై బెంగుళూరులోని అన్ని వాటర్ ట్యాంకర్లను మార్చి 7వ తేదీలోపు నమోదు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. వారందరితో మార్చి 12న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అక్కడి నీటి కొరతను ఎదుర్కొనేందుకు తాలూకా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. నీటి సమస్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయడంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. 236 తాలూకాల్లో.. 219 తాలూకాలు తీవ్రంగా ప్రభావితమవతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.