‘నన్ను బలిపశువును చేశారు’, ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే, కస్టడీ పొడిగింపు
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది...
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది. నిజానికి ఆయన కస్టడీ నేటితో ముగిసింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఈ కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించాలన్న విజ్ఞప్తిని కోర్టు అనుమతించింది. కాగా ఈ కేసులో తనను బలిపశువును చేశారని వాజే పేర్కొన్నారు. (ఈయనను అధికారులు కోర్టులో హాజరు పరిచారు). వాజే ఇంటిలో తాము 62 బులెట్లను కనుగొన్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇవి రిజిస్టర్ కాని తూటాలని వారు చెప్పారు. ఈయన సర్వీస్ రివాల్వర్ కోసం 30 బులెట్లు ఇవ్వగా 5 మాత్రమే కనుగొన్నామని, మిగిలినవన్నీ ఎక్కడ దాచాడో తెలియలేదని వీరు అన్నారు. ఎస్ యూ వీ వాహన యజమాని మాన్ సుఖ్ హిరేన్ మృతి కేసులో కూడా వాజేను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి నిందితుని (వాజే) రక్త నమూనాలను డీఎన్ఏ కోసం తాము సేకరించామని, అలాగే ఇతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 5 వాహనాలను కూడా మ్యాచింగ్ కి గాను వాటి శాంపిల్స్ సైతం కలెక్ట్ చేశామని అధికారులు కోర్టుకు తెలిపారు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి వాజే యత్నించాడని వారు ఆరోపించారు. వాజే ఇంటి నుంచి 5 ఖరీదైన వాహనాలను పోలీసులు ఇటీవల సీజ్ చేశారు.
మాన్ సుఖ్ మర్డర్ కేసులో మరి కొందరు కూడా అరెస్టయినట్టు వారు చెప్పారు. కాగా- ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్ లో తాను అధికారులకు సహకరించానని, తనను మళ్ళీ పోలీసు కస్టడీకి పంపరాదని సచిన్ వాజే కోర్టును కోరాడు. ఈ కేసులో యాంటీ టెర్రర్ స్క్వాడ్.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కూడా ఇతనిపై కేసు పెట్టారు. ఇందుకు ఈయన తరఫు లాయర్ అభ్యంతరం చెప్పారు. తన క్లయింటును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: CM KCR: ‘కేసీఆర్‌ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేయాలి’.. అసెంబ్లీలో మనసులో మాట బయటపెట్టిన మంత్రి