Baba Ramdev: తీవ్ర దుమారం రేపుతున్న రాందేవ్ బాబా కామెంట్స్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..
మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Baba Ramdev Controversy: మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యోగా గురు వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ మండిపడింది. గాంధీభవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాందేవ్‌బాబా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దుస్తులు లేకపోతేనే ఆడవాళ్లు అందంగా ఉంటారు..ఇవీ బాబా నోటి వెంట రాలిపడ్డ మాటలు. ఆయనేంటి ఇలా అనడమేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారిప్పుడు. మహారాష్ట్రలోని థానేలో మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా శిబిరంలో బాబా పాల్గొన్నారు. యోగా చేసిన తర్వాత మహిళలు యోగా దుస్తులు మార్చుకోడానికి సమయం లేకపోవడంతో.. చాలామంది అలాగే శిబిరానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. మహిళలు సహజంగానే సౌందర్యరాశులని చెప్పబోతూ నోరు జారారు. చీరల్లో అయినా.. సల్వార్‌లో అయినా.. ఏమీ ధరించకపోయినా కూడా ఆడవాళ్లు అందంగా ఉంటారన్నారు బాబా. పక్కనే ఉన్న అమృతా ఫడ్నవీస్.. బాబా కామెంట్స్‌తో ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. పైకి మాత్రం.. చిరునవ్వులు ఒలికించారు.
చర్యలు తీసుకోండి: నారాయణ
మహిళలపై రాందేవ్ బాబా చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాందేవ్ బాబా పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.




గతంలోనూ రాందేవ్‌బాబా వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో బాబారాందేవ్ అల్లోపతి వైద్య విధానాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరకు సుప్రీంకోర్టు సైతం ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఆడవాళ్ల దుస్తులతో ఎందుకు పారిపోయాడో తెలిసింది..
మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు, వ్యాపారవేత్త రామ్‌దేవ్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకురాలు మహువా మోయిత్రా మండిపడ్డారు. “పతంజలి బాబా రాంలీలా మైదాన్ నుంచి ఆడవాళ్ళ దుస్తులతో ఎందుకు పారిపోయాడో ఇప్పుడు నాకు తెలుసింది.. తనకు చీరలు, సల్వార్‌లు అంటే ఇష్టమంటూ చెప్పారు..” అని ఎంపీ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
క్షమాపణలు చెప్పాలి..
రామ్‌దేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఖండించారు. మహిళలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..