Telugu News » Spiritual » According to chanakya neeti dont do these mistakes in front of your children chanakya niti in telugu
Chanakya Neeti: తల్లిదండ్రులకు అలెర్ట్.. పిల్లల ముందు మర్చిపోయి కూడా ఇలా ప్రవర్తించకండి.. అలా చేస్తే..
Shaik Madarsaheb |
Updated on: Nov 26, 2022 | 4:31 PM
అచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు.. ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలి.. ఏయే సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించారు.
Chanakya Neeti
Chanakya Neeti: అచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు.. ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలి.. ఏయే సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించారు. ఆచార్య చాణక్యుడి బోధనలు నేటికీ.. చాలామందికి కనువిప్పు కలిగిస్తున్నాయి. చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు దాగున్నాయి. ఇది చాణక్య సొంత అనుభవం ఆధారంగా మాత్రమే కాదు, ఎంతో దూరదృష్టితో బోధించిన శాస్త్రం.. వీటిని స్వీకరించడం ద్వారా జీవితంలో విజయం సాధించడంతోపాటు ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ముందు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చాణక్యుడు నీతిశాస్త్రంలో సూచించాడు. పిల్లల ముందు ఏ పనులు చేయకూడదు.. ఎలాంటి విషయాలను మాట్లాడుకోవద్దు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మీ భాషను నియంత్రించుకోండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం భాషపై.. సంయమనం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లల ముందు మాట్లాడేటప్పుడు భాషలో అసభ్య పదజాలం వాడకూడదు. పిల్లలు వాటిని స్వీకరించడం వలన.. మున్ముందు అదే పద్దతిని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే వారి ముందు మంచి భాషను ఉపయోగించండి.
తప్పులపై ప్రశ్నించుకోవద్దు : తరచుగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుండడం సర్వసాధారణం. అయితే ఈ సమయంలో పిల్లల ముందు పొరపాటున కూడా ఒకరి లోపాలను మరొకరు చెప్పుకోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గుతుంది.
గౌరవం : చాణక్య నీతి ప్రకారం.. ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు గౌరవాన్ని కలిగిఉండాలి. తల్లిదండ్రులు ఒకరి పట్ల మరొకరు గౌరవం కలిగి ఉంటే.. పిల్లలు అదే పద్దతిని అనుసరిస్తారు. పొరపాటున కూడా కించపరిచే పదాలు లేదా దూషణలను ఉపయోగించకూడదు. అలా చేస్తే పిల్లలు కూడా ఒకరినొకరు గౌరవించుకునే బదులు.. అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడం మొదలుపెడతారు.
అబద్ధం చెప్పడం మానుకోండి: చాణక్యుడు తన నీతి శాస్త్ర చాణక్య నీతిలో తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదని చెప్పాడు. ఎందుకంటే ఈ పొరపాటు పిల్లలకు అలవాటుగా మారవచ్చు. కావున ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఘర్షణను నివారించండి: కొందరు తల్లిదండ్రులు పరస్పరం మాట్లాడుకునే సమయంలో ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. పిల్లల ముందు ఇలా చేయడం చాలా తప్పు. చాణక్య విధానం ప్రకారం.. మీరు పిల్లల ముందు పోరాడితే, వారి దృష్టిలో మీ గౌరవం పోతుంది. వారు కూడా మున్ముందు అలానే ప్రవర్తిస్తారు.