AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temple Tourism: సముద్రం మధ్యలో గుడి.. పాపాలు పొగొట్టే ఆలయంగా ప్రసిద్ధి.. ఈ సమయంలోనే దర్శనం.. ఎక్కడంటే..

ఎత్తైన కొండల్లోనో, సముద్ర తీరంలోనో, నది ఒడ్డులో ఆలయాలు ఉండటం తెలుసు.. కాని సముద్రం మధ్యలో ఆలయం అంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు.. సముద్రం మధ్యలో ఆలయం ఉంటే భక్తులెలా దర్శించుకుంటారనే అనుమానం..

Temple Tourism: సముద్రం మధ్యలో గుడి.. పాపాలు పొగొట్టే ఆలయంగా ప్రసిద్ధి.. ఈ సమయంలోనే దర్శనం.. ఎక్కడంటే..
Nishkalank Mahadev Temple
Amarnadh Daneti
|

Updated on: Nov 26, 2022 | 3:45 PM

Share

ఎత్తైన కొండల్లోనో, సముద్ర తీరంలోనో, నది ఒడ్డులో ఆలయాలు ఉండటం తెలుసు.. కాని సముద్రం మధ్యలో ఆలయం అంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు.. సముద్రం మధ్యలో ఆలయం ఉంటే భక్తులెలా దర్శించుకుంటారనే అనుమానం రావచ్చు. కాని గుజరాత్‌ కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో ఓ ఆలయం మాత్రం ఎంతో స్పెషల్.. సముద్రం మధ్యలో ఉండటమే కాదు.. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా.. ఆ ఆలయానికి చేరుకోవడానికి నిర్ధిష్ట సమయం ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి నీరు ఆలయం వద్ద ఉండదంటే అతిశయోక్తికాదు. హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ నిష్కలంక మహదేవ్ ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. సముద్రం మధ్యలో ఉండే ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రం భావనగర్ కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలోని కొలియాక్ సముద్రతీరంలో ఉంటుంది. తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో నిష్కలంక్ మహదేవ్ ఆలయం ఉంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేదనే అర్థం వస్తుంది. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు. కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే సందర్శకులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తరువాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

 ఈ రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు

ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు మహాశివుడ్ని దర్శించుకోవడంతో పాటు.. ఈ ఆలయం వద్ద గడపవచ్చు. రాత్రి 7 గంటలు దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.

ఆలయ చరిత్ర

పురణాల ప్రకారం సముద్రం మధ్యలో ఉండే నిష్కలంక మహదేవ్ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్రే ఉంది. మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచినప్పటికి.. ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడట. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని శ్రీకృష్ణుడు చెబుతారని, దీంతో పాండవులు రోజుల తరబడి ఆవుల వెంటే నడిచేవారని పురణాలు చెబుతున్నాయి. ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయని, ఆ సమయంలో పాండవులు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం తపస్సు చేస్తారని, వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడని, దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందినట్లు పురణ గాధల ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు. బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని చాలా మంది విశ్వాసం. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటి వరకూ తుపాన్లు, అలల వలన ఈ జెండా దెబ్బతినలేదంటే అతిశయోక్తి కాదు. దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం చూడండి..