IND vs WI : మార్చి 1న అసలైన యుద్ధం.. ఈడెన్ సెంటిమెంట్ భారత్ సెమీస్ ఆశలు నెరవేరుస్తుందా?
IND vs WI : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. సూపర్-8 రౌండ్‌లో గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే తన సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుని టేబుల్ టాప్‌లో నిలిచింది .

IND vs WI : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. సూపర్-8 రౌండ్‌లో గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే తన సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుని టేబుల్ టాప్‌లో నిలిచింది. ఇప్పుడు అందరి కళ్లు గ్రూప్-1లోని రెండో సెమీఫైనలిస్ట్ జట్టుపైనే ఉన్నాయి. ఈ స్థానం కోసం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మార్చి 1న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా డూ ఆర్ డై పోరు జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇది చూడటానికి లీగ్ మ్యాచ్ అయినా, ప్రాక్టికల్‌గా క్వార్టర్ ఫైనల్ లాంటిదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీమిండియా ఈక్వేషన్స్ ఓ సారి పరిశీలిస్తే.. ప్రస్తుతం భారత్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒక విజయం, ఒక ఓటమితో 2 పాయింట్లు కలిగి ఉంది. వెస్టిండీస్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో సూర్య సేన వెస్టిండీస్‌ను ఏ తేడాతో ఓడించినా, భారత్ 4 పాయింట్లతో గ్రూప్-1లో రెండో స్థానానికి చేరుకుంటుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలవాలంటే ఈ అడ్డంకిని అధిగమించడం టీమిండియాకు చాలా కీలకం. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై వెస్టిండీస్‌కు ఉన్న అద్భుతమైన రికార్డును దృష్టిలో పెట్టుకుంటే, భారత్‌కు ఇది అంత సులభమైన పని కాదు.
ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, తర్వాతి ప్రత్యర్థి ఎవరనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్-2లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. గ్రూప్-2లో ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో అజేయంగా టేబుల్ టాప్‌లో నిలిచింది. కాబట్టి, భారత్ కనుక క్వాలిఫై అయితే, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో ఢీకొనడం ఖాయం. ఈ హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరు మార్చి 5న ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో జరగనుంది.
గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈసారి టీమిండియాకు మంచి అవకాశం దక్కనుంది. అటు తండ్రి మరణించినా దేశం కోసం జట్టులోకి తిరిగి వస్తున్న రింకూ సింగ్ వంటి వీరుల రాకతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. మరి మార్చి 1న ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌ను చిత్తు చేసి, మార్చి 5న వాంఖడేలో ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
