AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pen Theft: పెన్ను దొంగిలించాడనీ అమానుషం.. 3వ తరగతి బాలుడిని బ్యాట్‌, బెల్ట్‌తో చావగొట్టిన టీచర్!

కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న ఓ ఆశ్రమ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెన్ను దొంగిలించాడని 3వ తరగతి విద్యార్థిని ఆశ్రమ ఇన్‌ఛార్జ్‌ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి, చితకబాదాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.. తరుణ్‌ కుమార్‌ అనే బాలుడు అన్న అరుణ్‌ కుమార్‌తో కలిసి రాయ్‌చూర్‌లోని రామకృష్ణ ఆశ్రమ పాఠశాలలో..

Pen Theft: పెన్ను దొంగిలించాడనీ అమానుషం.. 3వ తరగతి బాలుడిని బ్యాట్‌, బెల్ట్‌తో చావగొట్టిన టీచర్!
Ramakrishna Ashram School
Srilakshmi C
|

Updated on: Aug 05, 2024 | 11:53 AM

Share

రాయచూర్‌, ఆగస్ట్‌ 5: కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న ఓ ఆశ్రమ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెన్ను దొంగిలించాడని 3వ తరగతి విద్యార్థిని ఆశ్రమ ఇన్‌ఛార్జ్‌ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి, చితకబాదాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.. తరుణ్‌ కుమార్‌ అనే బాలుడు అన్న అరుణ్‌ కుమార్‌తో కలిసి రాయ్‌చూర్‌లోని రామకృష్ణ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో ఆశ్రమంలో చదివిస్తున్నారు. తరుణ్‌ మూడో తరగతి, అరుణ్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే గత శనివారం విద్యార్థులంతా ఆడుకుంటుండగా.. తరుణ్‌ పెన్ను దొంగతనం చేశాడని తోటి విద్యార్థి అతనిపై ఆశ్రమ ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వేణుగోపాల్‌.. తరుణ్‌ను ఓ గదిలో 3 రోజులపాటు బంధించి విచక్షణారహితంగా కొట్టారు. అతడి దెబ్బలకు బాలుడి ఒంటిపై గాయాలయ్యి, వాచిపోయాయి.

ఆదివారం తరుణ్‌ తల్లి ఆశ్రమానికిరాగా.. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటం గమనించింది. దీంతో జరిగిన విషయాన్ని అరుణ్‌ ఆమెకు వివరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. తరుణ్‌ను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. టీచర్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్ధులు కూడా తనను కొట్టినట్లు తరుణ్‌ చెప్పాడు. కళ్లకు గంతలు కట్టి, చేతులకు తాడు కట్టిమరీ టీచర్‌ దాడి చేశాడు. మొదట కట్టెతో కొట్టారని, అది విరిగిపోవడంతో బ్యాట్‌తో కొట్టి హింసించినట్లు తెలిపాడు. అలా అర్ధరాత్రి వరకూ కొడుతూనే ఉన్నట్లు బాలుడు తెలిపాడు. అనంతరం పెన్ను దొంగిలించినందుకు డబ్బులు ఇవ్వాలని టీచర్‌ కోరగా.. తన వద్ద డబ్బులు లేవని బాలుడు తెలిపాడు. దీంతో యాద్గిర్‌ రైల్వే స్టేషన్‌లో భిక్షాటన ఎత్తాలని ఆదేశించాడు. అయితే తనకు ఎవ్వరూ చిల్లిగవ్వ ఇవ్వలేదని చెప్పాడు. దీంతో ఆ తర్వాత కూడా టీచర్‌ దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టినట్లు తెలిపాడు. ఇదంతా కేవలం ఒక్క పెన్ను గురించి జరిగిందని, అసలు ఆ పెన్ను తాను తియ్యలేదని, తన పెన్ను అయిపోతే వేరే విద్యార్ధి ఆ పెన్ను ఇచ్చినట్లు తెలిపాడు. సదరు పెన్ను ఆ విద్యార్ధిదే అనుకున్నానని, లేకపోతే అసలు తాకేవాడినే కాదని తల్లికి చెప్పి కన్నీరుపెట్టుకున్నాడు. అది టీచర్‌ పెన్నని, పెన్సు కోసం వెతకగా తరుణ్‌ బ్యాగులో దొరికిందని వెల్లడించాడు. టీచర్‌ దెబ్బల ధాటికి తరుణ్‌ రెండు కళ్లు వాచిపోయి, ఒళ్లంతా గాయాలయ్యాయి. ప్రస్తుతం తరుణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇద్దరు పిల్లలను చదివించడానికి తగిన స్థోమత లేకపోవడం వల్లనే ఆశ్రమంలో ఉంచి చదివిస్తున్నామని, పిల్లలను చూడటానికి వెళ్లినప్పుడు జరిగిందంతా పెద్ద కొడుకు చెప్పాడని తరుణ్‌ తల్లి పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆశ్రమ ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.