బీజేపీకే కాదు.. ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం ఆరెస్సెస్సే మాతృసంస్థ.. ఓవైసీ సంచలన ఆరోపణలు
ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీతో పోల్చారు. రెండు పార్టీలు సైద్ధాంతకంగా ఐక్యంగా ఉన్నాయని, రెండూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని హైదరాబాద్ ఎంపీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ 1980లో జన్‌సంఘ్‌ను స్థాపించి, ఆ తర్వాత బీజేపీని 2012లో ఏర్పాటు చేసిందన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించక ముందే ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో పరస్పరం ఆరోపణలను, విమర్శలను అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (INC)లు ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతుండగా.. తాజాగా ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం పదునైన విమర్శలతో ఎంట్రీ ఇచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తామని శనివారం(జనవరి 4) ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) మాతృసంస్థ అని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కేవలం బీజేపీకి మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం తల్లిలా వ్యవహరిస్తోందని ఓవైసీ ఆరోపించారు. తద్వారా ముస్లిం మైనారిటీ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఇటు ఆప్, అటు బీజేపీలను ఏకకాలంలో విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కలిసి నగరంలోని చెత్తనంతా తీసుకొచ్చి ముస్లింలు నివసించే ప్రాంతాల్లో విసిరేస్తున్నారని ఓవైసీ మరో ఆరోపణ చేశారు. దీంతో సరికొత్త రాజకీయ రగడ మొదలైంది.
హిందుత్వ ప్రయోగశాలలో ఆప్ జననం
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సైద్ధాంతికంగా ఒకటేనని, రెండు పార్టీలకు ఆర్‌ఎస్‌ఎస్ సాయపడుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదం లేదని, రెండూ హిందుత్వాన్నే నమ్ముతాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆప్‌లను ఆర్‌ఎస్‌ఎస్ సృష్టించిందని ఒవైసీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తొలుత జనసంఘ్‌ను ఏర్పాటు చేసి, 1980లో బీజేపీగా మార్చిందని వెల్లడించారు. రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 2012-13లో ఏర్పడిందని, ఇది ఆరెస్సెస్ ప్రయోగశాలలో అభివృద్ధి చెందిన హిందుత్వ పార్టీ అని వ్యాఖ్యానించారు.
ముస్లిం ప్రాంతాల్లో పాఠశాలలు ఏవి?
ఢిల్లీలో విద్యావ్యవస్థను ప్రక్షాళించి అన్ని ప్రాంతాల్లో మెరుగైన పాఠశాలలు నిర్మించామని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఒక్కసారి ముస్లిం ప్రాంతాల్లో వచ్చి చూపించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ముస్లిం ప్రాంతాల్లో చెత్త తీసుకొచ్చి వేస్తున్నారు తప్ప పాఠశాలలు నిర్మించడం లేదని విమర్శించారు. ఆప్ చెబుతున్న అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని, ముస్లిం ప్రాంతాలకు వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు.
ఎన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ?
మరోవైపు ఢిల్లీలో ఎన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందన్న అంశంపై ఓవైసీ స్పష్టత ఇవ్వలేదు. ఆ అంశాన్ని తమ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు నిర్ణయిస్తాడని తెలిపారు. AIMIM చీఫ్ ఓవైసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. తన అధికారిక ట్విట్టర్ (X)ఖాతాలో కూడా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఢిల్లీలో వీర్ సావర్కర్ పేరిట ఓ కళాశాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంపై ఓవైసీని ప్రశ్నించగా.. కపూర్ ఎంక్వైరీ కమీషన్ ఫలితాలను ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అని తాను ప్రధాని మోదీని అడగాలనుకుంటున్నానని ఒవైసీ చెప్పారు.
ప్రధాని మోదీ అజ్మీర్ దర్గాకు చాదర్ పంపినా ప్రయోజనం లేదని ఒవైసీ అన్నారు. ప్రస్తుతం ఉన్న మసీదులు లేదా దర్గాలపై కోర్టుల్లో దావా వేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదులను నమ్ముకున్న వారి పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందనే సందేశం చాదర్ పంపడం వెనుక దాగి ఉందన్నారు. అయితే కొన్ని మసీదుల విషయంలో వాదిస్తున్నట్లుగా ఖ్వాజా అజ్మీర్ దర్గా దర్గా కాదని బీజేపీ వాళ్లు కోర్టులకు వెళ్లి చెబుతున్నారని ఓవైసీ గుర్తుచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..