AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMPV Virus: చైనాలో పెరుగుతున్న వైరస్ కేసులు.. భారత్ ఏమని చెప్పిందంటే..

చైనాలో జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. WHOకూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ ఫ్లూయెంజా, ఆర్ఎస్ వీ, హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంటున్నారు.

HMPV Virus: చైనాలో పెరుగుతున్న వైరస్ కేసులు.. భారత్ ఏమని చెప్పిందంటే..
Hmpv Outbreak In China
Shaik Madar Saheb
|

Updated on: Jan 05, 2025 | 12:06 PM

Share

చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్‌లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

చైనాలో జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. WHOకూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ ఫ్లూయెంజా, ఆర్ఎస్ వీ, హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌ తెలిపింది. భారత్‌లో HMPV వైరస్‌ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్ఎస్ఐ, హెచ్ఎంపీవీ వంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక వేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇటు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా HMPV వైరస్‌ కేసుల వ్యాప్తిపై అప్రమత్తమైంది. తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కడా లేవని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ రవీందర్‌నాయక్‌ ప్రకటన విడుదల చేశారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌ చలికాలంలో జలుబు, సాధారణ ఫ్లూ లక్షణాలు కలగజేస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఆయన తెలిపారు. ఈ వైరస్‌పై భయాందోళనలు అక్కర్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.

జలుబు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తుమ్ములు, దగ్గు వచ్చినపుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవాలని, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కరచాలనం చేయడం, జబ్బు చేసిన వారి దగ్గరకు వెళ్లడం, కళ్లు, ముక్కును తరచూ తాకడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చేయకూదడని, వైద్యులను సంప్రదించకుండా మందులు వాడకూడదని రవీందర్‌నాయక్‌ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..