PM Modi: నమో భారత్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం.. ఢిల్లీ – మీరట్ మధ్య పెరిగిన కనెక్టివిటీ..!

సాహిబాబాద్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ నుండి న్యూ అశోక్ నగర్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో కూడా ప్రధాని ప్రయాణించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా భద్రత, విశ్వసనీయత, అధిక వేగం, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

PM Modi: నమో భారత్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం.. ఢిల్లీ - మీరట్ మధ్య పెరిగిన కనెక్టివిటీ..!
Pm Modi In Delhi Metro
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 05, 2025 | 1:14 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జనవరి 5) ఉదయం ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. సాహిబాబాద్ – న్యూ అశోక్ నగర్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన అదనపు విభాగాన్ని ప్రారంభించారు. ఉదయం హిండన్ ఎయిర్‌బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ అదనపు మెట్రో లైన్‌ను జాతికి అంకితం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని మెట్రో నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించారు. సాహిబాబాద్ RRTS స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు నమో భారత్ రైలులో ప్రయణించారు. రాపిడ్ రైల్‌లో చిన్నారులతో ముచ్చటించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న 13 కిలోమీటర్ల కారిడార్ లో ప్రధాన స్టేషన్ ఆనంద్ విహార్‌తో సహా ఆరు కిలోమీటర్లు భూగర్భంలో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ విభాగంలో నమో భారత్ రైళ్లు నడపడం ఇదే తొలిసారి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసే విధంగా నమో భారత్ స్టేషన్లను రూపొందించారు.

ప్రస్తుతం RRTS ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో 42 కిలోమీటర్ల మేర నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ మెట్రోకు NCRలో 393 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ ఉంది. ఢిల్లీలో రవాణా వ్యవస్థను విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు ప్రధాని మోదీ. దేశ రాజధాని అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి పూర్తిగా అంకితమైన ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ కొత్త కనెక్టివిటీ వల్ల లక్షలాది మంది ప్రయాణికులు నేరుగా ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. దాదాపు రూ. 1200 కోట్ల వ్యయంతో ఢిల్లీ మెట్రో ఫేజ్-IVలోని జనక్‌పురి – కృష్ణా పార్క్ మధ్య 2.8 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఢిల్లీ మెట్రో ఫేజ్-IV మొదటి విభాగం ప్రారంభోత్సవంతో ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తుంది. ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్ పొడవు 82.15 కిలోమీటర్లు. ఇది ఢిల్లీలో 14 కిలోమీటర్లు, యూపీలో 68 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఫేజ్-1లో ప్రతిపాదించిన మరో రెండు కారిడార్లలో ఒకటైన ఢిల్లీ-పానిపట్ కారిడార్ పొడవు 103.02 కిలోమీటర్లు. అల్వార్- సరాయ్ కాలే ఖాన్ మధ్య కారిడార్ పొడవు 106 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి పానిపట్, అల్వార్ వరకు కారిడార్ నిర్మాణం తర్వాత ఢిల్లీ-NCRలోని RRTSలోని అన్ని కారిడార్ల మొత్తం పొడవు 291 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈ రెండు కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రారంభోత్సవంతో పశ్చిమ ఢిల్లీలోని కృష్ణా పార్క్, వికాస్‌పురి – జనక్‌పురి వంటి ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. దీనితో పాటు, ఢిల్లీ మెట్రో ఫేజ్-IV కింద సుమారు రూ. 6230 కోట్లతో 26.5 కి.మీ పొడవున రిథాలా-కుండ్లీ సెక్షన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని రిథాలా నుండి హర్యానాలోని కుండ్లికి అనుసంధానం చేయడానికి ఈ కొత్త కారిడార్ నిర్మిస్తున్నారు. ఇది ఢిల్లీ – హర్యానాలోని వాయువ్య ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

న్యూఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సీఏఆర్‌ఐ) కోసం కొత్త అత్యాధునిక భవనానికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.185 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కొత్త క్యాంపస్ అత్యాధునిక ఆరోగ్య సేవలు – వైద్య మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఇది పరిశోధకులు, రోగులకు మెరుగైన అనుకూలంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టులన్నింటి ప్రారంభోత్సవం ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్, కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా ఇక్కడ నివసించే పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచే ఆరోగ్యం, విద్యా, ఇతర ప్రాథమిక సౌకర్యాలలో అభివృద్ధికి దోహదపడుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..