వయస్సొచ్చిన అమ్మాయిలకు, గర్భిణులు – బాలింతలకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఆ సమస్యలన్ని పరార్..
మటన్ తిల్లి (నెరడు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్, ప్రోటీన్, విటమిన్ B12 పుష్కలంగా ఉండటంతో రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, ఎదిగే పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రుచికరమైన మటన్ తిల్లి కూరను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.

మటన్‌ను నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు.. మటన్‌లో B12 సహా చాలా పోషకాలు దాగున్నాయి.. అయితే.. మేక మాంసంలో దాదాపు చాలా భాగాలు ప్రత్యేకమైనవి.. మేక మాంసం, మటన్ లివర్, తిల్లి, కాళ్లు, తలకాయ, బోటి, దబ్బ.. ఇలా అన్ని పార్ట్స్ స్పెషల్.. వేటికవే ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.. అయితే.. మేక తిల్లి (Goat Spleen) లాభాలు మాత్రం చాలా ఎక్కువ.. ఆడపిల్లలకి, ప్రెగ్నెన్సీలో.. ఆ తర్వాత బాలింతలకి రక్తాన్ని పెంచే బెస్ట్ ఫుడ్ తిల్లి.. అంతేకాకుండా.. రక్తహీనతను దూరం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తిల్లిలోని ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 సహా పల పోషకాలు.. ఎన్నో సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, బాలింతలలో రక్తాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా.. బలహీనంగా ఉన్నవారికి తక్షణ శక్తిని, బలాన్ని అందించే అద్భుతమైన వంటకం తిల్లి.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు రకాలుగా పేర్కొంటారు. తిల్లిని నెరడు అని కూడా పిలుస్తారు. దీనిని తయారుచేయడం చాలా సులభం. ఇది కేవలం పెద్దలకే కాకుండా, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదని.. ఆహార నిపుణులు చెబుతున్నారు.
మటన్ తిల్లి కూర వంటకం
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి తిల్లి కూర ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ పోషకమైన వంటకం బాలింతరాలకు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి చాలా ప్రయోజనకరమైనది. మటన్ లివర్ లేదా తిల్లిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ రుచికరమైన తిల్లి కూరను తయారుచేయడానికి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో నాలుగు టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక చిన్నగా కట్ చేసుకున్న మూడు తిల్లి ముక్కలను వేసి, నూనెలో బాగా విస్తరించాలి. తిల్లి ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి. ఆ తరువాత, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తిల్లి ముక్కలపై చేత్తో బాగా అద్దాలి. దీనికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా జోడించాలి. పసుపు – అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన తిల్లి పచ్చివాసన, నీచు వాసన తగ్గుతుంది, ఉప్పు కలపడం వలన ముక్కలు గట్టిగా మారకుండా ఉంటాయి. ఇప్పుడు మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
ఐదు నిమిషాల తరువాత, మూత తీసి ఒకసారి బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఆ తరువాత, ఒక పెద్ద ఉల్లిపాయను పేస్ట్ లా చేసుకుని దీనికి జోడించాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. బాలింతల కోసం ఈ వంటకం తయారుచేసేటప్పుడు, ఇరవై ఒక్క రోజుల వరకు ఉల్లిపాయను ఉపయోగించకూడదు. ఈ దశలో ఉల్లిపాయను మినహాయించి వంటకాన్ని కొనసాగించవచ్చు.
నూనె పైకి తేలడం మొదలైనప్పుడు, రెండు టీ స్పూన్ల కారం వేయాలి. బాలింతల కోసం అయితే కేవలం పావు టీ స్పూన్ కారం మాత్రమే ఉపయోగించాలి. ఒక టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని తప్పకుండా వేయాలి.. ఇది కూరకు చక్కటి రుచినిస్తుంది. చివరగా, పావు టీ స్పూన్ గరం మసాలా జోడించాలి. బాలింతల కోసం వండేటప్పుడు గరం మసాలాను పూర్తిగా మినహాయించాలి. ఉప్పు సరిపోకపోతే, మరొక పావు టీ స్పూన్ నుండి అర టీ స్పూన్ వరకు కలుపుకోవచ్చు. ఇప్పుడు పావు గ్లాసు నీటిని పోసి, మసాలాలు తిల్లి ముక్కలకు బాగా పట్టేలా బాగా కలిపి, సిమ్ లో పెట్టి దగ్గరపడే వరకు ఉడికించాలి. కూర చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక బౌల్ లోకి మార్చుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా, రుచికరమైన, ఆరోగ్యకరమైన మటన్ తిల్లి కూర సిద్ధం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తిల్లి కూరను సిద్ధం చేసుకోని.. ఆస్వాదిస్తూ తినండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
