AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవి బాట వీడి.. ఆత్మీయత వడ్డన వైపు.. సుక్మాలో సరికొత్త ‘తుంగల్’ విప్లవం!

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం అంటే ఒకప్పుడు తుపాకుల మోత, మందుపాతరల పేలుళ్లు, భయానక వాతావరణం గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సుక్మా జిల్లాలోని తుంగల్ డ్యామ్ సమీపంలో పరిస్థితి మారుతోంది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, హింసా మార్గంలో నడిచిన మహిళా మాజీ నక్సలైట్లు ఇప్పుడు సమాజానికి ఆత్మీయతను వడ్డిస్తున్నారు.

అడవి బాట వీడి.. ఆత్మీయత వడ్డన వైపు.. సుక్మాలో సరికొత్త ‘తుంగల్’ విప్లవం!
Tungal Natures Cafe
Balaraju Goud
|

Updated on: May 21, 2026 | 2:23 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం అంటే ఒకప్పుడు తుపాకుల మోత, మందుపాతరల పేలుళ్లు, భయానక వాతావరణం గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సుక్మా జిల్లాలోని తుంగల్ డ్యామ్ సమీపంలో పరిస్థితి మారుతోంది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, హింసా మార్గంలో నడిచిన మహిళా మాజీ నక్సలైట్లు ఇప్పుడు సమాజానికి ఆత్మీయతను వడ్డిస్తున్నారు. అటవీ శాఖ సహకారంతో డిసెంబర్ 2025లో ప్రారంభమైన ‘తుంగల్ నేచర్స్ కేఫే’ (Tungal Natures Cafe) నేడు ఒక సామాజిక పరివర్తనకు వేదికైంది.

ఒకప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లుగా ఉండి, లక్షల రూపాయల రివార్డులు కలిగిన మహిళలు ఇప్పుడు కేఫే మేనేజర్లుగా మారారు. కుహ్రామ్ రామే, మాడ్వి బుధ్రి, ముచాకి సోమే, మడ్కం పోజే, కల్ము పాయ్కే అనే ఐదుగురు మహిళలు ఈ కేంద్రం వెన్నెముకగా నిలుస్తున్నారు. వీరంతా దాదాపు 10 ఏళ్లకు పైగా అడవుల్లో సాయుధ పోరాటాల్లో పాల్గొన్నవారే. ప్రభుత్వం వీరి తలపై రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు రివార్డులను కూడా ప్రకటించిందంటే వారు ఎంత చురుకైన కేడరో అర్థం చేసుకోవచ్చు.

లొంగిపోయిన తర్వాత ఈ మహిళలు పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పుడు, వారిలో వంట చేయడంపై ఉన్న ఆసక్తిని అధికారులు గమనించారు. వారి నైపుణ్యానికి పదును పెట్టి, పర్యాటక ప్రాంతమైన శబరి నది తీరాన ఈ కేఫే బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం వారు వంట చేయడం, కస్టమర్లకు వడ్డించడం.. కేఫే పరిసరాల్లో మొక్కలను పెంచడం, ప్రాథమిక అకౌంట్లను నిర్వహించడం వంటి పనులు చేస్తున్నారు. నెలకు వీరు అందుకునే రూ. 8,000 వేతనం ఆర్థికంగా చిన్నదే కావొచ్చు, కానీ గౌరవప్రదమైన జీవితాన్ని గడపడంలో అది వారికి కొండంత అండగా నిలుస్తోంది. “తుపాకీతో అడవుల్లో తిరిగినప్పుడు లేని ప్రశాంతత, ఇప్పుడు గరిటె పట్టి వంట చేస్తున్నప్పుడు కనిపిస్తోంది. ఇది మా మొదటి స్వతంత్ర సంపాదన,” అని వారు గర్వంగా చెబుతున్నారు.

శబరి నది బ్యాక్‌వాటర్స్ మధ్య ఉన్న ఈ కేఫే కేవలం ఒక హోటల్ మాత్రమే కాదు, అది ఒక సయోధ్య కేంద్రం. గతంలో నక్సల్స్ దాడిలో బాధితులుగా మిగిలిన వారు, పర్యాటకులు, స్థానికులు ఇక్కడకు వస్తుంటారు. ఒకప్పుడు శత్రువులుగా చూసిన ప్రజలతోనే ఇప్పుడు ఈ మహిళలు సంభాషిస్తున్నారు. టీ కప్పుల మధ్య సాగుతున్న ఈ మాటలు పాత గాయాలను మాన్పుతున్నాయి. అడవికి, నాగరిక సమాజానికి మధ్య ఉన్న దూరాన్ని ఈ కేఫే తగ్గిస్తోంది.

బస్తర్ రీజియన్‌లోని సుక్మా, బీజాపూర్, దంతెవాడ వంటి జిల్లాల్లో మారుతున్న సామాజిక చిత్రపటానికి ఈ ‘తుంగల్ నేచర్స్ కేఫే’ ఒక నిదర్శనం. ప్రభుత్వ పునరావాస పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఉపాధిని కల్పిస్తే సాయుధ పోరాటాలు వీడి ఎందరో ప్రధాన స్రవంతిలోకి వస్తారని ఈ ప్రయోగం నిరూపిస్తోంది. తుపాకీ పట్టిన చేతులే ఇప్పుడు గరిటె పట్టి ప్రశాంతమైన రేపటి వైపు అడుగులు వేయడం బస్తర్ చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ మహిళల పరివర్తన కేవలం వారి వ్యక్తిగత విజయం మాత్రమే కాదు; హింసను వీడి శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక స్ఫూర్తిదాయక పాఠం.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us