AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బాబోయ్ యాసిడ్ పురుగులు.. మంటతోపాటు దురద.. ఒంటిపై వాలితే అలా అస్సలు చేయకండి..

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు వంటి సమస్యలు కలిగిస్తోంది. వర్షాకాలంలో తేమ పెరగడంతో వీటి సంచారం అధికమైందని నిపుణులు చెబుతున్నారు.

Andhra: బాబోయ్ యాసిడ్ పురుగులు.. మంటతోపాటు దురద.. ఒంటిపై వాలితే అలా అస్సలు చేయకండి..
Rove Beetles
M Sivakumar
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 5:38 PM

Share

ఏపీలోని పలు జిల్లాలలో యాసిడ్ పురుగులు అలజడి సృష్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌గా పిలిచే ఈ పురుగుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గత నెలరోజులుగా గ్రామంలో పెద్ద సంఖ్యలో కనిపిస్తున్న ఈ పురుగులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లలోకి ప్రవేశిస్తూ చిన్నారులు, వృద్ధులు, మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో పలువురు ఈ పురుగుల బారిన పడి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. మొదట సాధారణ పురుగులుగా భావించి చేతులతో నలిపివేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. ఈ పురుగుల శరీరంలో ఉండే పెడెరిన్ అనే విషపదార్థం చర్మంపై పడిన వెంటనే మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు ఏర్పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో గాయాలు మరింత తీవ్రమై చికిత తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతోంది.

జగన్నాథపురం గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలోనూ ఈ పురుగులు కనిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. రాత్రి సమయంలో లైట్లు వెలిగిస్తే గుంపులుగా వచ్చి గోడలపై, పడకగదుల్లో, దుస్తులపై వాలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసి పిల్లలు తెలియక వాటిని చేతులతో పట్టుకోవడం, వృద్ధులు గమనించక శరీరంపై నలిపివేయడం వల్ల ఎక్కువగా బాధపడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇదిలా ఉండగా రోవ్ బీటిల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కీటక సమూహాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇవి సాధారణంగా తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, తోటలు, చెరువుల పరిసరాల్లో నివసిస్తాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల జిల్లాలో వర్షాలు, తేమ శాతం పెరగడంతో ఈ పురుగుల సంచారం కూడా అధికమైందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ పురుగులు కుట్టవు. కానీ శరీరంపై వాలినప్పుడు వాటిని చేతితో నలిపేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. నలిపిన సమయంలో విడుదలయ్యే పెడెరిన్ ద్రవం చర్మాన్ని తాకితే తీవ్రమైన చర్మ సమస్యలు వస్తాయి. అందుకే పురుగు శరీరంపై కనిపిస్తే నెమ్మదిగా ఊదేయడం లేదా పక్కకు తొలగించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే ఇళ్లలోకి ఈ పురుగులు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కిటికీలకు జాలి అమర్చడం, దోమతెరలు వినియోగించడం, రాత్రి సమయంలో అవసరం లేని లైట్లను ఆఫ్ చేయడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే రోవ్ బీటిల్స్ వెలుతురుకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి.

ఇప్పటికే గ్రామంలో పలువురు బాధితులు వైద్య సేవలు పొందుతున్నారు. యాసిడ్ పురుగుల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. గ్రామంలో ఫాగింగ్ నిర్వహించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, పురుగుల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

యాసిడ్ పురుగుల రూపంలో వచ్చిన ఈ కొత్త సమస్యతో చాలా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పురుగుల వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్నాథపురంలో ఎక్కడ చూసినా యాసిడ్ పురుగుల గురించే చర్చ సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us