AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులివెందుల బొరుగుల మిక్చర్.. రాయలసీమ రుచికి విదేశాల్లోనూ ఫిదా!

పులివెందులలో గత 75 ఏళ్లుగా తయారవుతున్న మిక్చర్ కొండయ్య బొరుగుల మిక్చర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాయలసీమ రుచిని అందించే ఈ మిక్చర్‌కు స్థానికులతో పాటు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు వెళ్లేవారు ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తుండటంతో పులివెందుల బొరుగుల మిక్చర్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకుంటోంది.

పులివెందుల బొరుగుల మిక్చర్.. రాయలసీమ రుచికి విదేశాల్లోనూ ఫిదా!
Mixture Kondaiah
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 11:34 AM

Share

పులివెందుల అంటే రాజకీయాలే కాదు.. అక్కడి ప్రత్యేక రుచులు కూడా ఎంతో ప్రసిద్ధి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఎంతో ఇష్టమైన బొరుగుల మిక్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాయంత్రం వేళ ఓ కప్పు టీతో బొరుగుల మిక్చర్ తినడం రాయలసీమలో చాలామందికి అలవాటు. అయితే పులివెందులలో తయారయ్యే ఈ బొరుగుల మిక్చర్ రుచి ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి విదేశాలకూ చేరుతోంది.

కడప జిల్లా పులివెందులలో గత 75 ఏళ్లుగా తయారవుతున్న ‘మిక్చర్ కొండయ్య’ బొరుగుల మిక్చర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానికులతో పాటు కర్ణాటక, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు అమెరికా సహా విదేశాలకు వెళ్లే పులివెందుల, కడప ప్రాంత వాసులు ఇక్కడి బొరుగుల మిక్చర్‌ను ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తారట. దీంతో ఈ రాయలసీమ రుచి విదేశాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రాయలసీమలో అనేక ప్రాంతాల్లో బొరుగుల మిక్చర్ తయారవుతున్నప్పటికీ, పులివెందులలోని మిక్చర్ కొండయ్య తయారు చేసే మిక్చర్ రుచి మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే విదేశాలకు వెళ్లేవారు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించుకుని తీసుకెళ్తుంటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ స్వీట్ స్టాల్‌ను ప్రస్తుతం మూడో తరం వారసులైన కృష్ణసాయి, జయప్రకాష్ నిర్వహిస్తున్నారు. వీరి తాత, స్థానికంగా మిక్చర్ కొండయ్యగా పేరొందిన వ్యక్తి ఈ దుకాణాన్ని, బొరుగుల మిక్చర్ తయారీని ప్రారంభించారు. అప్పటి నుంచి అదే రుచిని కొనసాగిస్తూ మూడు తరాలుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కేవలం రెండు గంటలపాటు మాత్రమే ఈ బొరుగుల మిక్చర్ విక్రయాలు జరుగుతాయి. అయినప్పటికీ ఆ రెండు గంటల్లోనే సుమారు 500 నుంచి 600 కిలోల వరకు మిక్చర్ అమ్ముడవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రతి వారం విదేశాలకు కూడా సుమారు 500 కిలోల వరకు పార్సిళ్లు పంపిస్తున్నామని వారు తెలిపారు.

రాయలసీమ రుచిని తనలో దాచుకున్న పులివెందుల బొరుగుల మిక్చర్.. ఇప్పుడు పులివెందుల వీధుల నుంచి అమెరికా వరకు ప్రయాణిస్తూ తన ప్రత్యేక రుచిని చాటుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us