పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి.. ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, లేదా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. అయితే చాలామంది పాన్ కార్డులపై ఏళ్ల నాటి పాత ఫొటోలు ఉండటం వల్ల కేవైసీలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యనే వచ్చిందా? అయితే పాన్ కార్డులో పాత ఫొటో మార్చేయండి.. ఇంట్లోనే ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం..

నేటి కాలంలో పాన్ కార్డు కేవలం ఆదాయపు పన్ను చెల్లింపులకు మాత్రమే పరిమితం కాలేదు. కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, కేవైసీ పూర్తి చేయాలన్నా, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, లోన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. అయితే చాలామంది పాన్ కార్డులపై ఏళ్ల నాటి పాత ఫొటోలు, అస్పష్టమైన రూపాలు ఉండటం వల్ల బ్యాంకింగ్ లేదా అధికారిక వెరిఫికేషన్ ప్రక్రియల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీ పాన్ కార్డులోని ఫొటో కూడా పాతబడిపోయిందా? ప్రస్తుత మీ రూపానికి మ్యాచ్ కావడం లేదా? అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా మీ పాన్ కార్డు ఫొటోను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ ఫొటో మార్చే విధానం
అధికారిక పోర్టల్ : ముందుగా Protean లేదా యుటిఐఐటీఎస్‌ఎల్ (UTIITSL) అధికారిక పాన్ సేవా పోర్టల్‌లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపించే PAN Correction లేదా Changes or Correction in existing PAN Data అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఫారం 49A ఎంపిక: భారతీయ పౌరులు Form 49A ని ఎంచుకుని, అందులో ఉన్న Photo Mismatch లేదా ఫొటో దిద్దుబాటుకు సంబంధించిన బాక్స్‌పై క్లిక్ చేయాలి.
వ్యక్తిగత వివరాల నమోదు: మీ పాన్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
లేటెస్ట్ ఫొటో అప్‌లోడ్: మీ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోను నిర్దేశించిన సైజులో స్పష్టంగా కనిపించేలా అప్‌లోడ్ చేయాలి.
గుర్తింపు పత్రం సమర్పణ: ఐడెంటిటీ ప్రూఫ్ కోసం గుర్తింపు కార్డు లేదా ఇతర ఆమోదిత ప్రభుత్వ పత్రాల స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు: పత్రాలన్నీ సమర్పించిన తర్వాత సవరణ రుసుము కింద రూ. 91తో పాటు వర్తించే జీఎస్టీని చెల్లించాలి. ఈ మొత్తాన్ని యూపీఐ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లించవచ్చు.
రసీదు భద్రపరుచుకోవడం: చెల్లింపు పూర్తయిన వెంటనే స్క్రీన్‌పై 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ కనిపిస్తుంది. భవిష్యత్తులో మీ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.
పత్రాలను పోస్ట్ ద్వారా పంపించాలా?
దరఖాస్తు ప్రక్రియలో మీరు ఎంచుకున్న వెరిఫికేషన్ విధానాన్ని బట్టి సంతకం చేసిన రసీదు కాపీతో పాటు సంబంధిత పత్రాలను పోస్ట్ ద్వారా పంపించాల్సి రావొచ్చు. పోర్టల్‌లో వచ్చే తుది సూచనల ఆధారంగా అవసరమైతేనే వీటిని పంపాల్సి ఉంటుంది.
ఫొటో అప్‌డేట్ ఎందుకు అవసరం?
పాన్ కార్డులోని ఫొటో స్పష్టంగా లేకపోయినా లేదా మీ ప్రస్తుత రూపంతో సరిపోలకపోయినా ఆర్థిక సంస్థలు కేవైసీ ప్రక్రియను నిలిపివేసే ప్రమాదం ఉంది. ముఖ్యాంశాలు గుర్తించలేక బ్యాంక్ ఖాతాలు నిలిచిపోవడం, లావాదేవీలు ఆగిపోవడం వంటి చిక్కులు రాకుండా ఉండాలంటే పాన్ కార్డులో స్పష్టమైన తాజా ఫొటో ఉండేలా చూసుకోవడం మంచిది.
