Chiranjeevi : యంగ్ టాలెంట్‌తోనే ఇండస్ట్రీ కళకళలాడుతోంది.. మెగాస్టార్ చిరంజీవి..
ఇట్లు అర్జున చిత్రంతో హీరోగా అనీష్ అరంగేట్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇంతమంది సినీ ప్రముఖులు ఒక కొత్త హీరోకు మద్దతు ఇవ్వడం అరుదని, ఇది అనీష్ తండ్రి ఏ.ఎమ్.ఆర్. మహేష్ రెడ్డి పుణ్యం, సినిమా పట్ల ఆయన భక్తి వల్లే సాధ్యమైందని చిరంజీవి పేర్కొన్నారు. చిత్రం విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు, యువ నటీనటులు తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల వల్లనే సినిమాలకు పూర్వవైభవం వస్తోందని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదలైన ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, చిత్ర యూనిట్‌ను అభినందించడంతో పాటు నేటి ట్రెండ్, యువత ప్రతిభపై కీలక వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా హీరో అనీష్ డెబ్యూకు లభించిన అపూర్వ మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించారు. “హీరో అనీష్… చాలా అదృష్టవంతుడివయ్యా నువ్వు. ఏ హీరోకి డెబ్యూటెంట్ ఫిలిం, ఒక కొత్త హీరోగా ఇంత మంది, ఇండస్ట్రీలో దాదాపుగా ఉన్నటువంటి హీరోస్ అందరూ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయటం అన్నది ఎవ్వరికీ దక్కలేదు. అది ఒక… అనీష్‌కే దక్కింది,” అని చిరంజీవి వ్యాఖ్యానించారు. మాకెవ్వరికీ కూడా ఇలాంటి మద్దతు దక్కలేదని, నాగార్జున గారికి కూడా ఇంతటి మద్దతు దక్కుంటుందని తాను అనుకోవడం లేదని చిరంజీవి అన్నారు.
అనీష్ చిన్నతనం నుంచే సినిమా షూటింగ్‌లు చూస్తూ సినిమా పట్ల మక్కువ పెంచుకున్నాడని, తాను కూడా నటుడు కావాలని సంకల్పించుకున్నాడని చిరంజీవి తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు ప్రోత్సహించారని పేర్కొన్నారు. “మా మహేష్ రెడ్డి అబ్బాయి అనేసరికి మాకు కూడా, యస్, ఇలాంటోడు రావాలి, ఇంత టాలెంట్ ఉండి, ఇంత ఇంట్రెస్ట్ ఉన్నందుకు మనం కూడా ఎంకరేజ్ చేయాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అతని వెనకాల నిలబడ్డారు,” అని చిరంజీవి అన్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అనస్వర రాజన్ తన అభినయంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాకే హైలైట్‌గా నిలిచారని చిరంజీవి పేర్కొన్నారు. సినిమాలో ఆమె వేరియేషన్స్ , డ్యాన్స్ అద్భుతంగా ఉన్నాయని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించారు. అలాగే ఈ సినిమాకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన కారణమని కొనియాడారు. నిర్మాత వెంకీ కుడుముల ఈ సినిమా ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
