ఒక ఎకరాలో వరి సాగుకు ఎంత ఖర్చు అవుతుంది..? రైతుకు మిగిలే ఆదాయం ఎంతో తెలుసుకోండి..
ఒక ఎకరం వరి వేయాలంటే రైతు చేతిలో ఎంత డబ్బులు ఉండాలి? పెరుగుతున్న ఎరువుల ధరలు, డీజిల్ రేట్లు, విపరీతమైన కూలీల కొరత నడుమ వరి సాగు రైతులకు సవాలుగా మారింది. ఒక ఎకరం వరి పండించడానికి నేల దుక్కి నుంచి పంట కోత దాకా ఏయే దశల్లో ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? అన్నదాతకు చివరకు మిగిలే లాభమెంత? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మన తినే అన్నం వెనుక ఓ రైతు ఆరుగాలం చేసే యుద్ధం ఉంటుంది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాలు, ఇంధన ధరల నేపథ్యంలో ఒక ఎకరంలో వరి సాగు చేయాలంటే రైతు జేబు నుంచి ఎంత మొత్తం ఖర్చవుతుంది? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. వరి సాగు ఆరంభంలో నేలను అనుకూలంగా మార్చుకోవడమే పెద్ద పని. ట్రాక్టర్ల సాయంతో పొలాన్ని రెండుమూడు దఫాలుగా దున్ని, దమ్ము చేయడానికి ఎకరానికి దాదాపు రూ.3,000 నుంచి రూ.6,000 వరకు ఖర్చవుతుంది. ఇక మేలైన దిగుబడిని సాధించేందుకు మార్కెట్‌లో అధిక నాణ్యత గల విత్తనాల కొనుగోలు, నారుమడి నిర్వహణ కోసం మరో రూ.2,000 నుంచి రూ.4,000 వరకు రైతు పెట్టుబడిగా పెడుతున్నాడు.
భారంగా మారుతున్న నాట్లు, కూలీల వేతనాలు
వరి సాగులో అత్యధిక వ్యయం అయ్యే వాటిల్లో కూలీల ఖర్చు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. వ్యవసాయ పనులకు గ్రామాల్లో కూలీల కొరత తీవ్రమవడంతో నాట్లు వేసే సమయానికి డిమాండ్ పెరిగిపోతుది. నారు పీకి పొలంలో నాటించే ప్రక్రియ పూర్తయ్యేసరికి ఎకరానికి ఏకంగా రూ.8,000 నుంచి రూ.10,000 దాకా కూలీల రూపంలోనే చేతిచమురు వదులుతోంది.
ఎరువుల యాజమాన్యం.. చీడపీడల రక్షణ
పైరు ఏపుగా ఎదిగే క్రమంలో డీఏపీ, యూరియా, పొటాష్ వంటి రసాయన ఎరువులతో పాటు పలు రకాల పోషకాలను అందించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా కాండం తొలుచు పురుగు, అగ్గితెగులు, సుడిదోమ వంటి సమస్యలను అరికట్టేందుకు పురుగుమందుల పిచికారీ, కలుపుతీత పనులు తప్పనిసరి. ఈ రక్షణ చర్యలు, ఎరువుల నిర్వహణ కోసమే సుమారు రూ.8,000 నుంచి రూ.12,000 వరకు బడ్జెట్ కేటాయించాల్సి వస్తోంది.
తడులు, మోటార్ల మెయింటెనెన్స్ వ్యయం
వరికి నిరంతరం నీటి సరఫరా అవసరం. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి విద్యుత్ ఉచితమే అయినప్పటికీ, మోటార్లు కాలిపోవడం, కేబుళ్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి అనుకోని నిర్వహణ వ్యయాల వల్ల నీళ్ల కోసం ఎకరానికి సగటున రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చవుతోంది.
యంత్రాలతో కోతలు.. తరలింపు చార్జీలు
వరి పొట్టకొచ్చి పండిన తర్వాత కోత కోసేందుకు గంటల ప్రాతిపదికన హార్వెస్టర్లకు చెల్లించే చార్జీలు, కోసిన ధాన్యాన్ని నిల్వ కేంద్రాలకు లేదా మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా వాహనాలు, బస్తాలు ఎత్తేందుకు హమాలీలకు ఇచ్చే కూలీ కలిపి ఎకరానికి మరో రూ.6,000 నుంచి రూ.12,000 వరకు అవుతోంది.
మొత్తం పెట్టుబడి ఎంత? రైతుకు మిగిలేదేంటి?
ఈ అంచనాలన్నింటినీ కలిపితే.. ప్రస్తుతం ఒక ఎకరంలో వరి వేయడానికి రైతుకు రూ.35,000 నుంచి గరిష్టంగా రూ.55,000 వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇంత భారీ వ్యయంతో చెమటోడ్చినా.. అకాల వర్షాలు, ఈదురుగాలులు పంటను దెబ్బతీస్తాయేమోనన్న భయం రైతును నిరంతరం వెంటాడుతుంది. చివరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా తేమ, తాలు పేరిట కోతలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సవాళ్లతో చాలా సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.




