October 01, 2026
Subhash
రైలు పట్టాల కింద, చుట్టూ చిన్న చిన్న రాళ్లు కనిపిస్తుంటాయి. అసలు ఈ రాళ్లను ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వీటి వెనుక ముఖ్యమైన ఇంజినీరింగ్ కారణం ఉంది!
పట్టాల కింద, చుట్టూ వేసే ఈ రాళ్లను ‘ట్రాక్ బ్యాలస్ట్’ అంటారు. ఇవి సాధారణ రాళ్లు కాదు. రైల్వే ట్రాక్‌ను స్థిరంగా, బలంగా ఉంచడంలో వీటికి కీలకమైన పాత్ర ఉంది.
రైలు వేగంగా ప్రయాణించినప్పుడు పట్టాలపై భారీ ఒత్తిడి, కదలికలు ఏర్పడతాయి. బ్యాలస్ట్ రాళ్లు స్లీపర్లను గట్టిగా పట్టుకుని ఉండేలా సహాయపడతాయి. దీంతో ట్రాక్ తన స్థానంలో స్థిరంగా ఉంటుంది
ఒక రైలు ఎంతో భారీ బరువుతో ప్రయాణిస్తుంది. బరువు వల్ల పట్టాలు, స్లీపర్లపై పడే ఒత్తిడిని బ్యాలస్ట్ విస్తృత ప్రాంతానికి పంపిణీ చేయడంలో సహాయపడుతుంది.
ఈ రాళ్ల మధ్య ఖాళీలు ఉంటాయి. వర్షం పడినప్పుడు నీరు ఆ ఖాళీల ద్వారా కిందికి వెళ్లిపోతుంది. దీంతో ట్రాక్ చుట్టూ నీరు నిలిచిపోవడం, నేల బలహీనపడటం వంటి సమస్యలు తగ్గుతాయి.
రైలు వేగంగా వెళ్లేటప్పుడు పట్టాలపై భారీ కంపనాలు ఏర్పడతాయి. బ్యాలస్ట్ రాళ్లు ఈ కంపనాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో ట్రాక్‌పై పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
రైల్వే ట్రాక్‌పై ఉండే రాళ్లు సాధారణంగా గరుకుగా, పదునైన అంచులతో ఉంటాయి. ఇలా ఉండటం వల్ల రాళ్లు ఒకదానితో ఒకటి బిగుసుకుని ట్రాక్‌కు మంచి స్థిరత్వాన్ని అందిస్తాయి.
పట్టాలను స్థిరంగా ఉంచడం, రైలు బరువు, ఒత్తిడిని పంపిణీ చేయడం, వర్షపు నీటిని బయటకు పంపడం, కంపనాలను తగ్గించడం ఇలా రైల్వే ట్రాక్ పనితీరులో బ్యాలస్ట్ రాళ్లు చాలా ముఖ్యమైనవి.