Telangana: తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షపాతం నమోదవుతుండగా, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలిని వాతావరణ శాఖ సూచించింది.

కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వర్షాలు తెలంగాణలో మళ్లీ జోరందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి తోడు, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవగా, ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా కనిపించింది. రాష్ట్రంలో నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలలో 5.1 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 4.7 సెం.మీ., పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ముత్తారంలలో 4.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా కల్హేర్, మెదక్ జిల్లా టేక్మల్‌లలో 4.2 సెం.మీ., కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి.
తప్పిన ప్రమాదం..
వర్షాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఆర్బీఐ రోడ్డుపై రవీంద్రభారతి సమీపంలో తెల్లవారుజామున ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో చెట్టు కింద ఉన్న విద్యుత్తు స్తంభం విరిగిపడటంతో పాటు రోడ్డుపై ఉన్న ఓ ఆటో పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు కూలుతున్న విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే కిందకు దూకి పరుగులు తీయడంతో పెను ప్రాణాపాయం తప్పింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
సోమవారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
