బ్యాంకు చెక్కు వెనుక ఎందుకు సంతకం పెట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..
డిజిటల్ పేమెంట్స్ యుగంలోనూ పెద్ద మొత్తాల లావాదేవీలకు చెక్కులే ప్రధాన ఆధారం. అయితే చాలామంది చెక్కు ఇవ్వగానే వెనుక వైపు సంతకం చేస్తుంటారు.. అసలు చెక్కు వెనుక సంతకం ఎందుకు పెట్టాలి? అన్ని చెక్కులకూ ఇది తప్పనిసరా? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే మీ ఖాతాలోని డబ్బు మరింత సురక్షితంగా ఉంటుంది.

డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరిగినప్పటికీ, భారీ మొత్తంలో నగదు బదిలీలకు నేటికీ బ్యాంక్ చెక్కులనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే చెక్కు ఇచ్చేటప్పుడు లేదా బ్యాంకులో జమ చేసేటప్పుడు చాలామంది వెనుకవైపు సంతకం పెడుతుంటారు. చాలామంది దీనిని అలవాటుగా చేసినప్పటికీ, చెక్కు వెనుక సంతకం పెట్టడం వెనుక బలమైన భద్రతా నిబంధనలు, అధికారిక రికార్డుల నమోదు ప్రక్రియ దాగి ఉన్నాయి. చెక్కులలో అత్యంత సాధారణమైనవి బేరర్ చెక్కులు. వీటిలో పేరు ఎవరిదైనా ఉన్నప్పటికీ ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లిన వ్యక్తికి నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మోసాలు లేదా దుర్వినియోగం జరిగే ప్రమాదం ఎక్కువ. అందుకే ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బేరర్ చెక్కును బ్యాంకులో సమర్పించే వ్యక్తి గుర్తింపు కోసం, రికార్డుల నమోదు కోసం చెక్కు వెనుక భాగంలో సంతకం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా వేరొకరి పేరు మీద ఉన్న బేరర్ చెక్కును విత్‌డ్రా లేదా డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు బ్యాంకులు ఈ సంతకాన్ని కచ్చితంగా పరిశీలిస్తాయి.
అకౌంట్ పేయీ చెక్కులకు అవసరం లేదా?
చెక్కు ఎడమవైపు పైభాగంలో రెండు సమాంతర గీతలు గీసి Account Payee Only అని రాసి ఉన్న చెక్కులు అత్యంత సురక్షితమైనవి. ఈ చెక్కులోని నగదు నేరుగా ఆ చెక్కులో పేర్కొన్న వ్యక్తి ఖాతాలోనే జమ అవుతుంది తప్ప ఇతరులకు నగదు రూపంలో చేతికందదు. అందువల్ల ఇలాంటి చెక్కుల వెనుక సంతకం పెట్టాల్సిన అవసరం నిబంధనల ప్రకారం ఉండదు. అయితే కొన్ని బ్యాంకులు అంతర్గత రికార్డులు, భవిష్యత్ వివాదాల నివారణ కోసం డిపాజిట్ చేసే వ్యక్తి సంతకాన్ని అడుగుతుంటాయి.
చెక్కు వెనుక సంతకం వల్ల కలిగే ప్రయోజనాలు
లావాదేవీల రికార్డు : చెక్కును సరైన వ్యక్తే అందుకున్నారనడానికి, నగదు బదిలీ ప్రక్రియ పూర్తి కావడానికి ఈ సంతకం బ్యాంకుకు అధికారిక సాక్ష్యంగా నిలుస్తుంది.
భవిష్యత్ వివాదాలకు చెక్: నగదు జమ విషయంలో ఏదైనా తేడా వచ్చినా లేదా క్లెయిమ్ వివాదాలు తలెత్తినా ఈ సంతకం ప్రాథమిక ఆధారంగా పనిచేస్తుంది.
దొంగతనాలు, మిస్‌యూజ్ నివారణ: చెక్కులు పోయినా లేదా చోరీకి గురైనా ఇతరులు వాటిని నగదుగా మార్చుకోకుండా నిరోధించడంలో ఇది ఉపయోగపడుతుంది.
చెక్కుపై ముందు లేదా వెనుక సంతకం చేసేటప్పుడు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. తప్పుడు లేదా నిర్లక్ష్యపు సంతకాలు నగదు బదిలీలో సమస్యలను సృష్టించే ప్రమాదం ఉంది. ఏ చెక్కుకు ఎప్పుడు సంతకం పెట్టాలో తెలుసుకోవడం ద్వారా లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకోవచ్చు.
