మీకు తెలుసా? కోడి ఓ దేశానికి జాతీయ పక్షి..! దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదిగో
భూమిపై లక్షలాది జీవ జాతులు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి వాటి ప్రత్యేకత, సాంస్కృతిక ప్రాముఖ్యత, దేశ చరిత్రతో ఉన్న సంబంధం కారణంగా జాతీయ జంతువులు లేదా జాతీయ పక్షుల హోదా ఇవ్వబడింది. భారతదేశంలో నెమలి జాతీయ పక్షి కాగా, మన దగ్గర సాధారణ కోడిలా కనిపించే ఒక అరుదైన అడవి పక్షికి మన పక్క దేశంలో జాతీయ పక్షి గౌరవం లభించింది. అయితే, ఈ కోడి ఏ దేశపు జాతీయ పక్షి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ప్రపంచంలోని ప్రతి దేశానికి దాని సాంస్కృతిక, సహజ సిద్ధమైన గుర్తింపును చాటిచెప్పే జాతీయ చిహ్నాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశ జాతీయ పక్షిగా నెమలికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే మన పొరుగు దేశమైన శ్రీలంక జాతీయ పక్షి ఏంటో మీకు తెలుసా? చాలామంది ఏదైనా అరుదైన గద్ద లేదా నెమలి అయ్యుంటుందని భావిస్తారు. కానీ శ్రీలంక జాతీయ పక్షి ఒక అడవి కోడి! శ్రీలంకన్ జంగిల్‌ఫౌల్ అని పిలిచే ఈ పక్షికి అక్కడి సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది.
శ్రీలంక జంగిల్‌ఫౌల్ ప్రత్యేకతలు: శ్రీలంకలోనే మాత్రమే లభించే ప్రత్యేక జాతి. ఈ అడవి కోడి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కేవలం శ్రీలంకలోని దట్టమైన అడవులు, జాతీయ పార్కులు, కొండ ప్రాంతాలలో మాత్రమే ఇది జీవిస్తుంది. అందుకే దీనికి దేశీయ చిహ్నంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.
సాధారణ కోళ్ల కంటే ఈ అడవి కోళ్లు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ముఖ్యంగా మగ కోళ్లు బంగారు పసుపు, ఎరుపు, నలుపు, మెరిసే నీలిరంగు ఈకలతో రంగురంగుల రూపంలో కనిపిస్తాయి. దీని కిరీటం పై భాగంలో ఉండే పసుపు రంగు మచ్చ దీని ప్రత్యేక ఆకర్షణ. ఈ అడవి కోడి చేసే కూత కూడా చాలా భిన్నంగా ఉంటుంది. శ్రీలంక స్థానిక భాషలో దీని శబ్దాన్ని జాన్-కిట్-చీర్స్ అని పిలుస్తారు. ఉదయాన్నే అడవుల్లో దీని కూత ఎంతో స్పష్టంగా వినబడుతుంది.
జాతీయ పక్షిగా ఎలా ఎంపికైంది?:
శ్రీలంక ప్రభుత్వం తమ దేశంలోని ప్రత్యేక జీవవైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ అడవి కోడిని జాతీయ పక్షిగా ప్రకటించింది. ఇతర దేశాలలో సాధారణంగా కనిపించే పక్షుల కంటే, తమ దేశంలో మాత్రమే పుట్టి పెరిగే ఈ అరుదైన జాతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీని రక్షణపై అవగాహన కల్పించవచ్చని శ్రీలంక భావించింది. ఈ అడవి కోడి ముఖ్యంగా నేలపై పడిన విత్తనాలు, చిన్న పురుగులు, పండ్లను తింటూ అడవి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే పర్యాటకులకు ఈ జాతీయ పక్షిని చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.




