సరిహద్దులు దాటిన పెళ్లి బాజాలు.. ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న 150 మంది పాక్ పెళ్లికూతుళ్లు..
సరిహద్దుల కంచెలు జరగాల్సిన పెళ్లిళ్ల ముందు నిలవలేకపోయాయి. భారత యువకులతో నిశ్చితార్థం జరిగి.. వాఘా సరిహద్దు మూసివేతతో నిలిచిపోయిన పాకిస్థానీ యువతుల పెళ్లిళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులతో 150 మందికి పైగా సింధీ వధువులు విమాన మార్గాల్లో ఎగురుతూ భారత్‌లోని తమ అత్తవారిళ్లకు చేరుకున్నారు.

భారత యువకులతో నిశ్చితార్థం జరిగి, సరిహద్దుల మూసివేత కారణంగా నిలిచిపోయిన పాకిస్థానీ యువతుల వివాహాలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్‌కు చెందిన 150 మందికి పైగా సింధీ వధువులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇతర దేశాల మీదుగా విమాన మార్గంలో భారత్‌కు చేరుకున్నారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సింధీ కుటుంబాలు తమ కూతుళ్లను భారత్‌లోని యువకులకు ఇచ్చి వివాహం చేయడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తుంది. ఇందుకోసం సాధారణంగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు మార్గాన్ని ఉపయోగించేవారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన సైనిక చర్యలు, దౌత్యపరమైన ఆంక్షల్లో భాగంగా అట్టారీ-వాఘా సరిహద్దు మార్గం మూతపడింది. అలాగే వీసాల జారీపై ఆంక్షలు విధించడంతో భారత్ యువకులతో నిశ్చితార్థాలు పూర్తయిన సుమారు 150 మంది పాక్-సింధీ వధువుల పెళ్లిళ్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
కేంద్రం విధించిన షరతుతో గ్రీన్ సిగ్నల్
ఈ అనిశ్చితిపై కమ్యూనిటీ ప్రతినిధులు, రాయ్‌పూర్ కేంద్రంగా ఉన్న ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రం షాదానీ దర్బార్ పీఠాధిపతి సంత్ యుధిష్ఠిర్‌లాల్ షాదానీని ఆశ్రయించారు. భారత్‌లోని నాగ్‌పూర్, రాయ్‌పూర్, జోధ్‌పూర్, పుణె వంటి నగరాల్లో వివాహం కావాల్సిన 150 మంది వధువుల జాబితాను తయారుచేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పరిశీలించి వారికి వీసాలు మంజూరు చేసింది. అయితే వారంతా భూమార్గం ద్వారా కాకుండా కేవలం విమాన మార్గంలో మాత్రమే ప్రయాణించాలనే నిబంధనను విధించింది.
వివిధ దేశాల మీదుగా భారత్‌కు రాక
ఈ నిబంధనల మేరకు గత కొద్ది నెలలుగా ఆ 150 మంది వధువులు తమ బంధువులతో కలిసి దుబాయ్, మస్కట్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల ట్రాన్సిట్ మార్గాల ద్వారా విమానాల్లో భారత్‌కు చేరుకున్నారు. ఇందులో కేవలం నాగ్‌పూర్‌కు చెందిన 15 పెళ్లి సంబంధాలు ఉన్నాయి. ఎట్టకేలకు తమ అత్తవారిళ్లకు చేరుకోవడంతో ఇరువైపులా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. పాకిస్థాన్‌లో ఇంకా ఇలాంటి 300 మందికి పైగా యువతులు భారత్‌కు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారని, వారికి కూడా ప్రభుత్వం వీసాలు జారీ చేయాలని కమ్యూనిటీ నేతలు కోరుతున్నారు.
