AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీని దైవత్వం నిండిన మహాత్ముడిగా ఆరాధిస్తున్న జనం.. బాపూజీ గుడి ఎక్కడో తెలుసా..?

తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దకాపర్తిలో మహాత్మా గాంధీకి అంకితం చేయబడిన ఓ ప్రత్యేక ఆలయం ఉంది. ఇక్కడ బాపూజీని దేవుడిలా కొలుస్తారు, నిత్య పూజలు నిర్వహిస్తారు. దేశభక్తి, అహింసను పెంపొందించే ఈ ఆలయం భక్తులకు, పర్యాటకులకు స్ఫూర్తినిస్తుంది. గాంధీ ఆశయాలను భావి తరాలకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

గాంధీని దైవత్వం నిండిన మహాత్ముడిగా ఆరాధిస్తున్న జనం.. బాపూజీ గుడి ఎక్కడో తెలుసా..?
Mahatma Gandhi Temple
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 12:21 PM

Share

సాధారణంగా దేవుళ్లకు గుడులు కట్టి పూజిస్తాం. మొక్కులు చెల్లించుకుంటాం. మన దేశంలో దేవతలతో పాటు పలువురు ప్రవక్తలకు, స్వామీజీలు, సినిమా యాక్టర్లకు కూడా కొందరు ఆలయాలను కట్టించారు. ఆ గుళ్ళలో నిత్య పూజలు కూడా నిర్వహిస్తుంటారు. కానీ భారత మాత కష్టాలను దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్య్రం సాధించడంలో అజరామరమైన పాత్ర పోషించిన మహాత్ముడికి దేవుడిగా కూడా ఆలయం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా పేరొందిన ఆ మహాత్ముడి ఆలయం ఎక్కడుందో తెలుసా..?

బ్రిటిష్ వారి నుంచి దాస్య విముక్తి కోసం.. భారతీయులకు స్వేచ్చా వాయువులను అందించడానికి ఎందరో వీరులు స్వాతంత్ర పోరాటం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడి స్మృతులు భావి తరాలకు అందించాలని, దేశానికి జాతిపిత గాంధీ చేసిన సేవలను ముందు తరాలు తెలుసుకోవాలనే ఆలోచనతో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ఈ దేవాలయాన్ని నిర్మించారు. జాతిపిత ఉద్యమ స్ఫూర్తిని, ఆయన అహింసా సిద్ధాంతాలను భావితరాలకు అందించాలనే ఉన్నత లక్ష్యంతో హైదరాబాద్-విజయవాడ హైవేనీ అనుకోని నాలుగు ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించింది. ఈ గుడికి 2012లో భూమి పూజ చేయగా.. 2014, సెప్టెంబర్ 17న ఆలయంలో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి ఆలయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమీప గ్రామాల నుంచి క్రమం తప్పకుండా గాంధీ ఆలయానికి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని సాధారణ రోజుల్లో 200 మంది సందర్శకులు వచ్చే ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల తర్వాత రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోంది.

దేవుడిలా జాతిపితకు నిత్య పూజలు…

రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయంలో భవనం పైఅంతస్తులో ప్రధాన ఆలయం ఉంది. కింద ఫ్లోర్‌లో భక్తులు ధ్యానం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో “ఓం నమో భగవతే గాంధీ దేవాయ నమో నమహ” అనే మంత్రంతో దేవుళ్లతో సమానంగా మహాత్ముడికి నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రధాన పూజారి సుప్రభాతం కీర్తనలతో తెరుస్తారు. ఆలయంలో సుప్రభాత సేవ, షోడశోపచార పూజలు, గాంధీ భజనలు జరుగుతుంటాయి.

ధర్మచక్రం.. ధ్వజస్తంభం…

అన్ని దేవాలయాల్లో మాదిరిగానే ఈ ఆలయంలో ధ్వజస్తంభ ఉంది. ఆలయం వెలుపల 32 అడుగుల ధ్వజస్తంభంతో పాటు ఒక అందమైన ధర్మచక్రం కూడా ఉంది. గాంధీజీ బోధించిన ధర్మసూత్రాలకు ప్రతిబింబంగా ఈ ధర్మచక్రం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆలయ గోడలపై గాంధీజీ సూక్తులు, సిద్ధాంతాలను లిఖించారు. అలాగే ఇక్కడ నవగ్రహాలు, పంచభూత లింగాల ఆలయాలు కూడా ఉన్నాయి

30 పవిత్ర స్థలాల నుండి సేకరించిన మట్టి..

ఈ దేవాలయంలో గాంధీ విగ్రహంతో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయి. అందులో నవగ్రహాలు, పంచభూతాలు ఆలయాలు ఉన్నాయి. ధ్వజ స్తంభం, బలి-పీఠం వంటి హిందూ దేవాలయానికి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. వైష్ణో దేవి, రామేశ్వరం, హాజీ అలీ దర్గా, బోధ గయా, పోర్‌బందర్, సబర్మతి, వార్ధా, రాజ్-ఘాట్ వంటి 30 పవిత్ర స్థలాల నుండి సేకరించిన మట్టినీ ఇక్కడ భద్రపరిచారు.

సర్వమత సమ్మేళనం..

ఆలయ ఆవరణలోని లైబ్రరీలో భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథ్ సాహెబ్ వంటి భిన్న మతాల పవిత్ర గ్రంథాలు దర్శనమిస్తాయి. ఈశ్వర్ అల్లా తేరా నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్.. అన్ని మతాల వారికీ ఆహ్వానమే అన్నట్టుగా భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథ్ సాహెబ్ వంటి భిన్న మతాల గ్రంథాలను ఈ ఆలయంలో ఉంచారు. ఆలయ గోడల మీద, చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ మీద మహాత్మా గాంధీ సందేశాలు, సిద్ధాంతాలు దర్శనమిస్తాయి.

పెళ్లి జంటలకు పట్టు వస్త్రాలు..

ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్నారు. పరిసర గ్రామాల్లో.. తమ ఇంట్లో పెళ్లి నిశ్చయమైతే, పెళ్లి పత్రికలను ముందుగా ఈ గాంధీ ఆలయంలో ఉంచి, బాపు ఆశీస్సులు తీసుకున్న తర్వాతే బంధువులకు పంచడం ఆనవాయితీగా మారింది. ఆ నూతన జంటలకు పట్టు వస్త్రాలను అందించడం ఆలయ ట్రస్ట్ ప్రారంభించింది. పరిసర గ్రామాల ప్రజలు, పర్యాటకులు మహాత్ముడిని మహాత్ముడిగా కాకుండా దైవత్వం నిండిన వ్యక్తిగా చూస్తారు. ప్రతి గాంధీ జయంతి రోజు సమీప గ్రామాల నుంచి మరియు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఆలయానికి వస్తారు. రోజంతా భజనలు ఉంటాయి,

మర్రి చెట్టుకు కుంకుమపువ్వు రిబ్బన్లు..

ప్రజలు తాము కోరిన కోర్కెలు నెరవేరాలని గుడి ఆవరణలో ఉన్న మర్రి చెట్టుకు కుంకుమపువ్వు రిబ్బన్లు ముడుపు కడతారు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలగడం, ఉద్యోగ బదిలీలు అవ్వడం వంటి కోరికలు ఇక్కడికి వచ్చాక నెరవేరాయని భక్తులు విశ్వసిస్తారు. మహాత్మా గాంధీ.. వారి కోరికలన్నింటినీ నెరవేరుస్తాడని పూజారి చెబుతున్నారు. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఆ మహనీయుడు గాంధీకి గుడి కట్టి పూజించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని స్థానికులంటున్నారు. గాంధీని నోట్లపై పుస్తకాలపైనే కాకుండా దైవంతో సమానంగా గుడి కట్టి అందులో పూజలు చేయడం సంతోషంగా ఉందని గాంధీయ వాదులు చెబుతున్నారు. గాంధీ ఆలయంలో ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉందని తద్వారా గాంధీ సూచించిన ఈ మార్గంలో పయనిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే దేశంలోని 30 ప్రముఖ పుణ్యక్షేత్రం దర్శించిన ఫలితం కలుగుతుందని చెప్పారు.

గాంధీని మహాత్ముడిగా కాకుండా దైవత్వం నిండిన వ్యక్తిగా ఇక్కడి జనం ఆరాధిస్తున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని దివ్య గమ్య స్థానాలలో ఒకటిగా చేర్చింది. కోరిన కోర్కెలు తీర్చే గుడిగా మహాత్ముడి ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు, విద్యార్థులకు అహింస, దేశభక్తిని చాటిచెప్పే ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us