AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘తెల్లకాగితం’ మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ నటించిన టీనేజ్ లవ్ స్టోరీ పరిస్థితేంటి..?

‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఆ తర్వాత బ్యాండ్ మేళం సినిమాతో వచ్చారు.. ఇప్పుడు ‘తెల్లకాగితం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. వరసగా లవ్ స్టోరీలే చేస్తూ తన వయసుకు తగ్గట్లు ముందుకు వెళ్తున్నారు. మరి ఇప్పుడొచ్చిన తెల్ల కాగితం పరిస్థితేంటి..? సినిమా నిజంగానే ఆకట్టుకుందా..? ఈ లవ్ స్టోరీలో కొత్త విషయాలేంటో పూర్తి రివ్యూలో చూద్దాం..

‘తెల్లకాగితం’ మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ నటించిన టీనేజ్ లవ్ స్టోరీ పరిస్థితేంటి..?
Tella Kagitham
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 2:03 PM

Share

మూవీ రివ్యూ: తెల్ల కాగితం

నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర, అజయ్, శరణ్య ప్రదీప్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్

నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ బండ్రెడ్డి

కథ:

భీమవరం చుట్టుపక్కల ఉండే ఓ ఊళ్లో రాము (హర్ష్ రోషన్) తన అన్నా వదినలతో కలిసి ఉంటారు.. చిన్నపుడే అమ్మా నాన్నలు లేకపోవడంతో అన్నా వదినలే అన్నీ అయ్యి పెంచుతారు. మరోవైపు అదే ఊళ్లో మెడికల్ షాప్ నడుపుకునే నిజాయితీ పరుడైన మూర్తి (అజయ్) ఉంటాడు.. ఆయన ఒక్కగానొక్క కూతురు ఆశ (నక్షత్ర) కూడా రాము చదివే స్కూల్‌లోనే ఉంటుంది.. పదో తరగతిలో ఉన్నపుడే ఇద్దరూ ప్రేమలో పడతారు. రాము నచ్చడంతో ఆశ కూడా లవ్‌లో పడిపోతుంది.. అదే సమయంలో మావయ్య (రాజ్ కుమార్ కసిరెడ్డి) చెప్పినవన్నీ విని అనవసరంగా తప్పుడు దారిలో వెళ్తాడు రాము. ముందు ముద్దు పెడతాడు.. ఆ తర్వాత ఇద్దరూ కలిస్తేనే లవ్ సెట్ అవుతుంది.. విడిపోకుండా ఉంటారని మామయ్య ఇచ్చిన సలహా మేరకు ఆశ దగ్గరికి అదే చేస్తాడు రాము.. ముందు వద్దన్నా రాము దూరం కాకూడదని తప్పటడుగు వేస్తుంది ఆశ.. ఆ తర్వాత వీళ్లిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి..? టీనేజ్‌లో చేసిన తప్పు కారణంగా వాళ్ళ లైఫ్ ఎలాంటి సందిగ్ధంలో పడిపోయింది అనేది మిగిలిన కథ..

కథనం:

టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి ఆ తర్వాత ఆ తప్పును ఎలా కప్పిపుచ్చాలో తెలియక ఇబ్బందులు పడే కథలు అప్పుడెప్పుడో చిత్రం సినిమా నుంచి వస్తున్నాయి.. తాజాగా తెల్ల కాగితం సినిమా కూడా అలాంటి కథే. స్కూల్‌లో మొదలైన ప్రేమ.. ఆ తర్వాత ముందుకెలా వెళ్లింది.. అనుకోకుండా వేసిన ఒక్క తప్పటడుగు కారణంగా అప్పటి వరకు ఉన్న జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయనే మంచి పాయింట్‌తోనే ఈ సినిమాను తీసారు. నిజంగా 15-18 వయసులో ఏం చేస్తున్నామనేది ఎవరికీ తెలియదు.. కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు. అలాంటి క్యారెక్టరైజేషన్‌తోనే హర్ష్ రోషన్, నక్షత్ర పాత్రలు డిజైన్ చేసారు.. మొదట్లో బాగానే ఉన్నా.. రాను రాను ఎందుకో మరీ తేలిపోయే సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. కండోమ్ సీన్, అలాగే ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ అప్పటి టీనేజ్ పిల్లలు ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారనే విషయం చూపించాడు.. పదో తరగతి చదివే కుర్రాడికి కండోమ్ అంటే ఏంటో తెలియకపోవడం.. దాన్ని బుడగ అనుకుని ఊదడం అనేది కాస్త ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది.. అమాయకమైన అబ్బాయి-అమ్మాయి మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి.. ఇంటర్వెల్‌లో వచ్చే ప్రగ్నెన్సీ టెస్ట్ నుంచే కథ ఊపందుకుంటుంది.. అక్కడ్నుంచి సెకండాఫ్ మళ్లీ కాస్త స్లో అవుతుంది.. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను నిలబెట్టింది.. చివర్లో హార్డ్ హిట్టింగ్ ఫినిషింగ్ ఇవ్వాలని ఫిక్సైపోయిన తర్వాతే అలా రాసుకున్నారని అర్థమవుతుంది. తెలియకుండా చేసిన చిన్న పొరపాటు కారణంగా లైఫ్ అంతా ఎలా మారిపోతుందో చూపించే ప్రయత్నమైతే బాగానే చేసారు.

నటీనటులు:

కోర్ట్ తర్వాత మరోసారి మంచి నటనతో ఆకట్టుకున్నాడు హర్ష్ రోషన్.. ఓవైపు చలాకీగా కనిపిస్తూనే మరోవైపు అమాయకమైన సీన్స్‌లోనూ మెప్పించాడు.. చివర్లో ఎమోషనల్‌గా బాగా చేసాడు.. నక్షత్ర మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది.. చూడ్డానికి కూడా బావుంది. హీరోయిన్ తండ్రిగా అజయ్ చాలా మంచి రోల్ చేసాడు.. ఈ సినిమాలో ఆయనే హైలైట్. హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన కుర్రాడు పర్వాలేదు. వదిన క్యారెక్టర్లో శరణ్య ప్రదీప్ బాగా నటించింది.. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

విజయ్ బుల్గానిన్ పాటలు బాగున్నాయి.. చిలకా పాట ఇప్పటికే మంచి హిట్టైంది.. బ్యాగ్రౌండ్ స్కోరో కూడా బాగుంది.. కె.వి.గుహన్ విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.. ఎడిటింగ్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. కొన్ని రిపీటెడ్ సీన్స్ విషయంలో ట్రిమ్ చేసుంటే బాగుండేది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా తెల్ల కాగితం.. ఒకట్రెండు మచ్చలు కనిపించినా.. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథే..!

Follow Us