మునగాకు షుగర్ పేషెంట్స్ కి ఓ వరం.. చక్కర లేకుండా మునగాకు లడ్డూని చేసుకోండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
ప్రస్తుతం వర్షాకాలం.. ఈ సీజన్ లో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు సీజనల్ వ్యాధులు కూడా ప్రభలే అవకాశాలున్నాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్పని సరి. ఇందుకోసం తినే ఆహారంలో మునగ లడ్డునీ చేర్చుకోండి. ఇవి శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఈ రోజు మునగాకుతో చేసే మునగ లడ్డు రెసిపీ గురించి తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జీవితాన్ని బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే సమయంకూడా దొరకడం లేదని వాపోతూ ఉంటారు. అయితే ఎవరికైనా సరే రోజు వారీ తినే ఆహారం ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకనే తినే ఆహారంలో చేర్చుకునే ఒక చిన్న విషయం మీ ఆరోగ్యంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. అలాంటి పోషకాలతో నిండిన ఆహారంలో మునగ ఆకు ఒకటి. దీనితో తయారు చేసే మునగ లడ్డు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. మునగ అనేక వ్యాధులతో పోరాడటానికి బలాన్ని ఇస్తుంది. మునగ లడ్డు రుచికరమైన లడ్డూ మాత్రమే కాదు.. వ్యాధులతో పోరాడటానికి ఒక కవచం కూడా. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. వీటిని తయారు చేయడం చాలా సులభం. అది కూడా చక్కర లేకుండా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మునగాకు లడ్డు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
మునగ లడ్డు తయారీకి కావాల్సిన పదార్ధాలు
- మునగ పొడి- 1 కప్పు (మునగ ఆకులను ఎండబెట్టి తయారుచేసిన పొడి )
- శనగపిండి -1/2 కప్పు (వేయించిన పిండి)
- నెయ్యి- 1/2 కప్పు
- ఖర్జూరం-1 కప్పు (విత్తనాలు తొలగించి పేస్ట్ చేయండి)లేదా బెల్లం- 1 కప్పు
- డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు)- 1/4 కప్పు (తరిగిన ముక్కలు)
- యాలకుల పొడి- 1/2 స్పూన్
తయారీ విధానం:
- ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసి వేడి చేసి.. తక్కువ మంట మీద శనగపిండిని వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి.
- తర్వాత ఇందులో మునగ పొడి వేసి 1-2 నిమిషాలు వేయించండి.
- ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లబరచండి.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఖర్జూర పేస్ట్ లేదా తురిమిన బెల్లం, డ్రై ఫ్రూట్స్ , యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి బాగా కలపండి.
- తర్వాత చేతులకు కొంచెం నెయ్యి రాసుకుని.. ఈ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చుట్టుకోండి.
- అంతే మునగాకు లడ్డులు రెడీ. ఈ లడ్డులు వారం నుంచి 15 రోజుల వరకు చెడిపోవు. వీటిని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా తినవచ్చు.
మునగ లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మునగలో విటమిన్ సి , విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
- రక్తంలో చక్కెర నియంత్రణ : మునగాకు లడ్డు మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మునగ సహాయపడుతుంది.
- కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది: ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది .
- ఎముకలను బలపరుస్తుంది: ఇందులో మంచి మొత్తంలో కాల్షియం, భాస్వరం ఉన్నాయి. కనుక ఈ మునగాకు లడ్డు ఎముకలను బలపరుస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది: మునగలో ఫైబర్ ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








