Telangana: చలి చంపేస్తోంది బాబోయ్.. అవసరం ఉంటేనే బయటకు రండి.. వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలంగాణలో గురువారం నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 5 రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జనం చలితో వణికిపోతున్నారు. హైవేపై వెళ్తున్న వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక నెమ్మదిగా వెళుతున్నారు. ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరు 4, అరకు 4.6, పాడేరు 6, చింతపల్లి 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 10 గంటలైనా మంచు తెరలు వీడలేదు. అటు పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది.పాడేరు ఏజెన్సీలో రెండ్రోజులుగా సింగిల్ డిజిట్స్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. పాడేరు మండలం సంగోడి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మంచు గాజు ముక్కలుగా మారిపోయింది.
ఇటు తెలంగాణలో గురువారం నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 5 రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశమున్నదని వెల్లడించింది. పొడిగాలి, బలమైన ఈశాన్య గాలులు రాత్రిపూట చల్లదనాన్ని పెంచడమే ఉష్ణోగ్రతల తగ్గుదలకు కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.6 డిగ్రీలుగా నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




