Daycare Horror: డే కేర్‌లో విచక్షణారహితంగా చిన్నారిపై దాడి.. శరీరంపై దెబ్బలు, గాట్లు.. వీడియో వైరల్
నేటి తల్లిదండ్రులు తమ తమ పనులతో రోజంతా బిజీబిజీగా గడపాల్సి వస్తుంది. దీంతో తమ చిన్నారి పిల్లల సంరక్షణ చూసుకునే సమయం దొరకడం లేదు. దీంతో పిల్లల సంరక్షణ కోసం డే కేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ పిల్లల అభివృద్ధి, సంరక్షణ కోసం వివిధ కార్యకలాపాలను, వినోదం, విద్యా కార్యక్రమాలను కూడా అందిస్తాయి. తమ పిల్లలను రక్షిస్తారంటూ భావించే తల్లిదండ్రులకు ఈ డే కేర్ సెంటర్ లో పని చేసే వారు షాక్ ఇస్తూ.. పసి పిల్లలను హింసిస్తున్న సంఘటనకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా 15 నెలల చిన్నారిపై పని మనిషి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నోయిడాలోని ఒక డే కేర్‌లో 15 నెలల బాలికను పనిమనిషి చెంపదెబ్బ కొట్టి, కొరికి, నేలపై పడేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టిన దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆగస్టు 4న ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఆ చిన్నారి తల్లి ఆమెను డే కేర్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శిశివు బాధగా ఏడుస్తూనే ఉంది. ఎంతగా ఓదార్చాలని చూసినా బాలిక ఏడుపు ఆపలేదు. అయితే పాప బట్టలు మారుస్తుండగా.. ఆ బాలిక తల్లి ఆమె రెండు తొడలపై వృత్తాకార గుర్తులను గమనించింది. ఆ తర్వాత ఆమె బాలికను వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. అప్పుడు డాక్టర్ ఆ గుర్తులను పరిశీలించి మనిషి కరిచినట్లు ఉన్నాయని చెప్పారు.
ఆ తర్వాత తల్లిదండ్రులు డే కేర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో పనిమనిషి పసి పిల్లపై విచక్షణా రహితంగా దాడి చేయడం కనిపించింది. పనిమనిషి ఏడుస్తున్న బాలికను ఎత్తుకుని, మొదట ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే బాలిక ఏడుపు ఆపకపోవడంతో.. పనిమనిషి సహనం కోల్పోయి ఆ చిన్నారి బాలికను నేలపై పడవేసి, గది తలుపు మూసివేసిన తర్వాత ఆమెను చెంపదెబ్బ కొట్టింది.
पारस टेरा सोसाइटी नोएडा में नियमों को ताक पर रख कर संचालित ब्लीपी डे केअर की नाबालिक (16वर्ष)सहायिका द्वारा 15 माह की बच्ची (वेदांसी) के साथ मार पीट व मुह से काट कर घायल कर दिया गया कृपया संज्ञान लें🙏 pic.twitter.com/MsQRMIM6uw
— kuldeep (@Kuldeep44816379) August 10, 2025
చిన్నారి ఏడుస్తున్నప్పటికీ.. డే కేర్ అధిపతి చిన్నారిని ఓదార్చడానికి లేదా రక్షించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. బదులుగా పనిమనిషి, డే కేర్ అధిపతి ఇద్దరూ దుర్భాషను ఉపయోగించారని, ఇదేమిటి అని ప్రశ్నించినందుకు తమని బెదిరించారని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సెక్షన్-142 పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితురాలైన పనిమనిషిని అరెస్టు చేశారు. “ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలైన పనిమనిషిని అదుపులోకి తీసుకున్నామని.. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి” అని ఒక పోలీసు అధికారి ధృవీకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








