ఆరోగ్యకరమైన, రుచికరమైన షుగర్ ఫ్రీ రసగుల్లాను ఎలా తయారు చేయాలో తెలుసా
చాలా మందికి స్వీట్లు తినడం అంటే ఇష్టం.. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనతో తినలేక పోతున్నారు. ముఖ్యంగా దీపావళి పండగ సమయంలో స్వీట్ తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ఇంట్లో చక్కెర లేకుండా స్వీట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా.. ఈ రోజు చక్కెర లేని రసగుల్లా ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరూ దీపావళి కోసం ఎదురు చూస్తారు.. పండగలో దీపాలు, స్వీట్స్, బాణాసంచా ప్రధాన పాత్రని వహిస్తాయి. ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్స్ కనిపిస్తాయి. కానీ కొంతమందికి స్వీట్స్ తినడం ఇష్టం ఉన్నా.. ఆరోగ్య కారణాల దృష్ట్యా తినలేరు. అటువంటి వారి కోసం ఈ రోజు మేము సరికొత్త రెసిపీ ని తీసుకొచ్చాం.. స్వీట్లను చక్కెర లేకుండా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందరికీ ఇష్టమైన బెంగాల్ స్వీట్ లో రసగుల్లాకి ప్రధమ స్థానం ఉంది. ఈ రోజు ఈ రసగుల్లాను ఇంట్లో చక్కెర లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
షుగర్ ఫ్రీ రసగుల్లా అంటే ఏమిటి?
చక్కెర లేకుండా రసగుల్లాలు సాంప్రదాయ బెంగాలీ రసగుల్లాల ఆరోగ్యకరమైన వెర్షన్. చక్కెర స్థానాన్ని స్టెవియా పొడి, ఎరిథ్రిటాల్ లేదా చక్కెర రహిత స్వీటెనర్‌తో భర్తీ చేస్తారు. దీంతో ఈ రసగుల్లా తినడానికి తీపిగానే ఉంటుంది. కేలరీలు ఉండవు.
కావలసిన పదార్ధాలు
పాలు – 1 లీటరు
నిమ్మరసం లేదా వెనిగర్ – 2 టీస్పూన్లు (పాలను విరిగేలా చేసేందుకు)
నీరు – 4 కప్పులు
స్టెవియా లేదా షుగర్ ప్రీ మాత్రలు- రుచికి అనుగుణంగా
రోజ్ వాటర్ – కొన్ని చుక్కలు (ఐచ్ఛికం)
కుంకుమపువ్వు రేకులు- 6 (అలంకరణ కోసం)
యాలకుల పొడి- ఒక స్పూన్
తయారీ విధానం: ముందుగా దలసరి గిన్నెలో పాలు పోసి.. ఆ పాలను మరిగించి నిమ్మరసం కలపండి. అప్పుడు పాలు విరుగుతాయి.
పనీర్ ను సిద్ధం చేయండి: నిమ్మరసం వేసిన పాలను వడకట్టి.. అందులోని పులుపుని పోగొట్టేందుకు పనీర్ లో చల్లటి నీటిని వేసి శుభ్రం చేసుకోండి.
రసగుల్లాలు (బంతులు) తయారు చేయండి: ఇలా వచ్చిన పనీర్ ను 10-12 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు పిసికి.. ఆపై చిన్న చిన్న బంతులుగా మృదువుగా , పగుళ్లు రౌండ్ గా లేకుండా చేయండి.
స్వీటెనర్ సిరప్ : ఒక దళసరి గిన్నె తీసుకుని నాలుగు కప్పుల నీరు పోసి నీటిని వేడి చేసి స్టెవియా లేదా షుగర్ ప్రీ మాత్రలు జోడించండి. ఈ నీరు మరుగుతున్న సమయంలో రెడీ చేసుకున్న రసగుల్లా బాల్స్ వేయండి.
ఉడికించాలి: ఇప్పుడు ఈ గిన్నె మీద మూతపెట్టి మీడియం వేడి మీద 10-12 నిమిషాలు ఉడికించండి.
చల్లబరచండి: ఆ బాల్స్ ఉడికి పెద్ద పెద్ద రసగుల్లలుగా మారతాయి. అప్పుడు స్టవ్ ఆపి సిరప్ ని చల్లార్చండి. తర్వాత యాలకుల పొడి, రోజ్ వాటర్ని , కుంకుమపువ్వు జోడించండి.
వీటిని ఎంతకాలం నిల్వ చేయవచ్చు?
షుగర్ ఫ్రీ రసగుల్లాలను రిఫ్రిజిరేటర్‌లో 2-3 రోజులు నిల్వ చేసుకోవచ్చు. వీటిని నిల్వ చేసే సమయంలో గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




