Food diet Myths: తింటూనే బరువు తగ్గొచ్చా.. ఏది అపోహ ఏది అవాస్తవం.. మీరే తెలుసుకోండి
బరువు తగ్గాలంటే ముందు భోజనం మానేయాలి.. ఓ పెద్దావిడ సలహా.. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ తినడమే హెల్త్ కి మంచిది.. ఓ స్నేహితుడి సూచన.. ఇదొక్కటే కాదు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరి వైద్యుల్లా మారి మనకు ఎన్నో రకాల ఉద్భోధలిస్తుంటారు. ఇలా ఈ విషయాలు మన మెదళ్లలో పాతుకుపోయేలా చేస్తుంటారు. నిజానికి మీరు పాటిస్తున్న ఆహారపు అలవాట్లలో చాలా వరకు అపోహలు, అవాస్తవాలే ఉంటాయి. అవేంటో ఇక్కడ చెక్ చేసుకోండి..

పెరిగిపోతున్న టెక్నాలజీ.. ప్రతి సమాచారాన్ని చిటికెలో అందుబాటులో ఉంచుతుంది. అయితే ఇందులో నమ్మదగిన విషయాలేవి.. నమ్మకూడని విషయాలేవి అనే విషయాలపై మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఈ సమాచారమంతా మన మెదడును రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తుంది. మనం ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం వంటి కీలకమైన విషయాల్లో ఫాలో అవుతున్న చాలా విషయాలు నిజానికి అపోలే . సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంలో చాలా వరకు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందులో కొన్ని కీలకమైన విషయాలు ఇవే..
కార్బోహైడ్రేట్లు విషంతో సమానమా..
బరువు తగ్గాలనుకునేవారు, హెల్తీ డైట్ ఫాలో అవుతున్నవారికి కార్బ్స్ పేరు చెబితే వెంటనే మొహం మూడు వంకర్లు తిప్పుతారు. ఇవి శరీరానికి మంచిది కాదని వారి ఫీలింగ్. కొంతవరకు ఇది నిజమే అన్ని రకాల కార్బోహైడ్రేట్లు మనకి మంచివి కావు. అయితే, కొన్ని శుద్ధి చేసిన కార్బ్స్ మాత్రం మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే అన్నింటినీ శరీరానికి శత్రువుల్లా చూడటం సరికాదంటున్నారు.
కొవ్వు బరువును పెంచేస్తుందా..
కొవ్వు శాతం కలిగిన పదార్థాలతో బరువు పెరుగుతారని.. లావుగా ఉన్నవారు సన్నంగా కాలేరని అంటుంటారు. ఇందులో నిజం లేదు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి మీకు తిన్న వెంటను కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అంతేకాదు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచుతాయి. ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఇవెంతో మంచివి. ఆవునెయ్యి వంటివి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఎప్పుడైతే నెయ్యికి చక్కెర పదార్థం తోడవుతుందో అది మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తుంది. లేదంటే మితంగా తీసుకుంటే కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి మేలు చేసే గుణాలను కలిగి ఉన్నాయి.
బరువు తగ్గాలంటే రాత్రి భోజనం మానేయాలా..
ఎలాగైనా బరువు తగ్గాలి అని మీరు ఎవరికైనా చెప్పి చూడండి. వారు తడుముకోకుండా ముందు చెప్పే సమాధానం రాత్రి పూట భోజనం మానేయ్ అంటారు. రాత్రి తినకుండా పడుకోవడం వల్ల పొద్దున్నే ఆకలి రెట్టింపవుతుంది. అప్పుడు తీసుకునే ఫుడ్ ఎక్కువ మోతాదులో తినేస్తుంటారు. ఇది మీ శరీరానికి మరింత డ్యామేజ్ కలిగిస్తుంది. రాత్రి పూట మంచి స్నాక్స్, ఆరోగ్యకరమైన భోజనం మంచిదే. వేపుళ్లు, నూనెలో వేయించిన పదార్థాల వంటి వాటికి దూరంగా ఉంటూ 7 లోపు భోజనం ముగిస్తే సరిపోతుంది. అంతేకాని భోజనం మానాల్సిన అవసరం లేదు.
జ్యూస్ తాగితే నిజంగా అన్ని లాభాలా..
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవాలని ఇవి బాడీని క్లెన్జ్ చేస్తాయని చెప్తుంటారు. నిజానికి ఇది పెద్ద అపోహ. ఫ్రూట్ జ్యూసులకన్నా పండ్లనే నేరుగా తినడం ఎంతో మంచిది. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం రాకుండా చేస్తుంది. కీరా, యాపిల్ వంటివి పొట్టుతో సహా తీసుకోవడం ఇంకా మంచిది. కేవలం జ్యూస్ లను మాత్రమే తీసుకుంటే అందులో పోషకాలు సగానికి సగం తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే జ్యూస్ ల పేరిట ఇందులో అధిక మోతాదులో షుగర్ ను కలుపుతారు. దాంతో పాటు అనారోగ్యాన్ని కలిగించే ఐస్ ను వేస్తుంటారు. ఇది మరిన్ని రోగాలను తెస్తుంది. దీనికి బదులు ఇంట్లో చేసుకునే జ్యూస్ లు కాస్త మేలు.
యూటీఐ సమస్యలకు బెర్రీ జ్యూస్..
యూటీఐ.. దీన్నే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ మూత్ర సంబంధిత వ్యాధులను క్యాన్ బెర్రీ జ్యూస్ తగ్గించేస్తుంది అని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ పండ్లు దీని నుంచి కొంత మేర ఉపశమనం కలిగిస్తాయన్నది వాస్తవం. కానీ పూర్తిగా యూటీఐ సమస్యను ఇవి తగ్గించలేవు. వైద్యులను కలిసి మీ సమస్యకు పరిష్కారం తీసుకోవాల్సిందే.
బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యానికి మంచివా..
గోధుమ రంగులో ఏది కనిపించినా అదే ఆరోగ్యానికి మంచిదని ఫిక్స్ ఐపోతుంటాం. బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ అలాగే బ్రౌన్ ఎగ్స్ కూడా. నిజానికి గుడ్డు పెంకు రంగుకు ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఏ రంగు గుడ్డు అయినా పోషకాల్లో ఎలాంటి తేడా ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గ్లూటెన్ లేని ఆహారాలే తీసుకోవాలా..
చాలా మంది ఆరోగ్యానికి మంచివని గ్లూటెన్ ఫ్రీ డైట్ ను ఫాలో అవుతుంటారు. నిజానికి కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది. గ్లూటెన్ కొందరి శరీర తత్వానికి పడదు. వారు దీనికి దూరంగా ఉంటే మంచిదే. అలాగని అందరికీ ఇది అవసరం లేదు. త్రుణ ధాన్యాల్లో మీ శరీరానికి అవసరమైన ఫైబర్, పోషకాలను కలిగి ఉంటుంది.




